ఆదిభట్ల : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇండ్లు గ్రామ, మున్సిపల్ పరిధిలో పారిశుధ్యంపై, వనమహోత్సవం కార్యక్రమం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 56.33శాతం ఇండ్ల గ్రౌండింగ్ అయ్యాయని, 43శాతం ఇంకా కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జూన్ 25 వరకు ఎలాంటి ఇండ్లు పెండింగ్ లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు.
ఇండ్ల నిర్మాణంలో పేద కుటుంబం మహిళలకు బ్యాంక్ లింక్ రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి అయిన 15 రోజుల్లో లెంటల్ లెవెల్‌కు వెళ్లే విధంగా పనిచేయాలని తెలిపారు. ఈ నెల 25లోగా ఇంకా ప్రారంభించని ఇండ్ల జాబితాను రద్దుచేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు తక్కువ గ్రౌండ్ చూపించిన మొయినాబాద్, నార్సింగ్ ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల మున్సిపాలిటీల అధికారులను వెంటనే చేయించాలని.. లేకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణంలో ఇసుకకు సంబంధించి అందుబాటులో ఉన్న ఇసుకను ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ మున్సిపల్ పరిధిలో ఈనెల 20 నుంచి 28 వరకు పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
డ్రైన్స్ క్లీన్ చేయించి రోడ్లకు ఇరువైపుల పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని.. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీ లేకుండా చూడాలని గ్రామపంచాయతీ మున్సిపల్లో అన్ని గుంతలను పూడ్చాలని, గ్రామాల్లో వీధి దీపాలు లేని ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని చెప్పారు. వన మహోత్సవంపై కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పని చేయాలని సూచించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని, గుంతలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మొక్కలు నర్సీలలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో డీఆర్వో సంగీత, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రామారావు, డీపీవో సురేష్ మోహన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి కేషురామ్, పీడీ హౌసింగ్ హనుమంతు నాయక్, గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ శ్రీలత, మెప్మా పీడీ మల్లీశ్వరి, డీఈవో సుశీందర్‌రావు పాల్గొన్నారు.