ఆదిబట్ల, నవంబర్ 23 : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు ప్రభుత్వ మోడల్ బాలికల పాఠశాలను శనివారం రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని విద్యార్థినులు కలెక్టర్కు తెలుపగా, రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. హాస్టల్ వంట గది, స్టోర్ రూంలను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్లోని సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వెంటనే రిపేర్ చేయించాలని అధికారులను ఆదేశించారు.
మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ ప్రతి ఒక్కరికీ పునాది వంటిదని, బాగా చదువుకుని అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్నారు. సోషల్ మీడియా, సినిమాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. హాస్టల్లో ఉన్న సమస్యలపై ఆరా తీసిన అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. కలెక్టర్ వెంట ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ సునీతారెడ్డి, ఆర్ఐ కృష్ణ తదితరులు ఉన్నారు.