రంగారెడ్డి, మార్చి 1 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ భూములను పరిరక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధరణి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సెక్షన్ సూపరింటెండెంట్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి కాకుండా రక్షించాలన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రోజువారీగా లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఈ నెల 15లోపు పెండింగ్ లేకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ భూములపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సర్వే ల్యాండ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ భూములను కాపాడేందుకు 15రోజుల డ్రైవ్ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి రాతి కడీలు, సూచిక బోర్డులు, కంచెలు ఏర్పాటు చేసి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు అధికారులు క్షేత్రస్తాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు కందుకూరు జగదీశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం అనంతరెడ్డి, చేవెళ్ల చంద్రకళ, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, మార్చి 1 (నమస్తేతెలంగాణ) : జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో రతగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒకరు చొప్పున సిట్టింగ్ స్వ్యాడ్లు, చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు. ఏర్పాటు చేసిన రూట్లల్లో రూట్ అధికారులను కేటాయించామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో అధికారులు తీసుకున్న శిక్షణను అనుసరించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను అనుమతించరాదని కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను ముందుగానే మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుధ్య నిర్వహణకు అమసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నిరంతర విద్యుత్, తాగునీరు ఉండేలా చూడాలని మూత్రశాలల సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను పోలీసు ఎస్కార్ట్‌తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యార్థులకు పరీక్షా ఫ్యాడ్, పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్‌టికెట్లను మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ప్రతి సెంటర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు.
ప్రాథమిక చికిత్స కిట్‌లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండాలని, ఆశ వర్కర్లను నియమించాలన్నారు. అవసరమైన చోట ఏఎన్ఎమ్లను నియమించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షల సమయానికి అనుకూలంగా విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు జగదీశ్వర్‌రెడ్డి, అనంతరెడ్డి, చంద్రకళ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యానాయక్, డీఈవో సుశీందర్‌రావు, రాచకొండ, సైబరాబాద్, పోలీసు అధికారులు, పోస్టల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు, మెడికల్ అధికారులు పాల్గొన్నారు.