షాబాద్, ఏప్రిల్ 26 : జిల్లాలో అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటరు జాబితా, పి.ఎస్.ఈ ఎంట్రీ ధ్రువీకరణ, ఓటరు ఎపిక్ కార్డుల జారీ, స్వీప్ యాక్టివిటీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండ్లు మారినవారి, మరణించినవారి పేర్లను తొలగించామని, వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించి, పోలింగ్ స్టేషన్‌వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా పరిశీలించి అందులో ఇండ్లు మారినవారి, మరణించినవారి పేర్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్ జాబితాను పోలింగ్ స్టేషన్లవారీగా పరిశీలించాలన్నారు. కొత్తగా ఓటర్‌గా నమోదు చేసుకున్న వారందరికీ ఎపిక్ కార్డులు పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. ఒకే ఇంట్లో ఆరుగురికంటే ఎక్కువ ఓట్లు ఉంటే సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడైతే ఓటరు నమోదు శాతం, ఓటు హక్కు వినియోగ శాతం తక్కువగా ఉందో అక్కడ ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం కోసం స్విప్ యాక్టివిటీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, సంబంధిత అధికారులున్నారు.
రూ.94.75 లక్షల పంట నష్ట పరిహారం
రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది మార్చి 17 నుంచి 21 వరకు కురిసిన వడగండ్ల వర్షాలకు యాచారం, మంచాల, తలకొండపల్లి మండలాల్లో 619 మంది రైతులు నష్టపోయిన వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు రూ.94.75 లక్షలు పంట నష్టపరిహారంగా రంగారెడ్డిజిల్లా ప్రభుత్వ ఖజానాకు జమ చేయబడినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి తెలిపారు. ఈ పంట నష్టపరిహారం సదరు రైతుల ఖాతాలో డీబీటీ ద్వారా జమ చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి 21 వరకు కురిసిన వడగండ్ల వర్షాలకు గురై నష్టపోయిన చేవెళ్ల, షాబాద్ మండలాల పంటల వివరాలు రైతులవారీగా అంచనా వేసి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించినట్లు, కలెక్టర్ ఆదేశానుసారం వ్యవసాయ, ఉద్యానవన అధికారులు చురుకుగా పంట నష్టం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.