Bird Flu | ఆదిభట్ల, ఫిబ్రవరి 10 : పక్క రాష్ట్రంలోని ఫౌల్ట్రీలలో బర్డ్ ప్లూ వ్యాధి సోకుతున్నందున జిల్లాలోని కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెటర్నీ అధికారులకు బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతే వెంటనే సంబంధిత వెటర్నీ దవాఖానలో సమాచారం ఇవ్వాలని యజమానులకు సూచించారు. ఇప్పటికే బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల ఫారాల యజమానులు తగు జాగ్రత్తుల తీసుకోవాలన్నారు. వెటర్నీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సహకరించాలని.. ప్రతి సమాచారం అందించాలని కోరారు. ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే వాటిని పాతిపెట్టి.. బయో కెమికల్ పౌడర్ చల్లాలన్నారు. మిగితా కోళ్లకు, పక్కన ఉన్న కోళ్ల ఫారాలకు వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదుల పై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 67 ఫిర్యాదులు వచ్చాయని, అందులో రెవెన్యూశాఖ- 35, విద్యుత్‌శాఖ- 4, ఫిడి హౌసింగ్- 10, సర్వేలాండ్- 4, మెప్మా-3, విద్యాశాఖ-5, డీపీవో -2, డీఆర్డీవో-4, మొత్తం కలిపి 67 దరఖాస్థులు వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పంపించామని చెప్పారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించామని అన్నారు.