యాచారం : దుర్గామాత ఊరేగింపులో కానిస్టేబుల్ సెల్‌ఫోన్ లాక్కొని దురుసుగా వ్యవహరించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాటిపర్తి గ్రామంలో శనివారం రాత్రి చేపట్టిన దుర్గామాత నిమజ్జనం కార్యక్రమానికి బందోబస్తుగా వెళ్లిన పోలీసుల పట్ల గ్రామస్తులు దురుసుగా వ్యవహరించారు. దుర్గామాత ఊరేగింపులో ట్రాక్టర్‌ను నడిరోడ్డు మద్యలో ఆపి డ్రైవర్ పక్కకు వెళ్లాడు. ఇంతలో కొంతమంది గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్‌ను తీయాలని వారితో గొడవకు దిగారు. ఇరువర్గాలకు పోలీసులు నచ్చ చెప్పినా పట్టించుకోకపోవడంతో కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ తన సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ నీలం శ్రీహరి సెల్‌ఫోన్ లాక్కోని కానిస్టేబుల్ కిరణ్‌ను, హోంగార్డు అశోక్‌ను బూతులు తిడుతూ పక్కకు తోసేసారు. పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారిలో ఉన్నట్లు తెలిపారు.