పెద్దేముల్, మే 18 : కేంద్రప్రభుత్వ నిధులతో ఆయా గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు రకాల పనులను నేషనల్ లెవల్ మానిటరింగ్ (జాతీయస్థాయి పర్యవేక్షణ బృందం)టీమ్ సభ్యులు గాంధీ గ్రామ్ రూరల్ యూనివర్సీటీ ప్రొఫెసర్లు మణివేల్, దేవన్ బుధవారం గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. మండల పరిధిలోని జనగాం, పెద్దేముల్, గోపాల్పూర్, బండమీదిపల్లి గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పల్లెప్రకృతివనాలు, వన నర్సరీలు, చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం, కమ్యూనిటీ ప్లాంటేషన్, జీపీల వారీగా జాబ్ కార్డుల అప్డేషన్, గ్రామపంచాయతీల్లో నిర్వహించే 7 రకాల రిజిస్టర్లు, కెనాల్ కాలువల శుభ్రత వంటి సుమారు 25 రకాల పనులను జీపీల వారీగా మండల, గ్రామస్థాయి అధికారులతో గ్రామాల్లో తిరుగుతూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
పలు పనులపై ఆరా..
పల్లెప్రకృతి వనాలు, వన నర్సరీలను పరిశీలిస్తూ ఎంత స్థలాల్లో నిర్మాణం చేపట్టారు? ఎన్ని రకాల మొక్కలు నాటారు? మొక్కలు ఏపుగా పెరుగడానికి ఏ జాగ్రత్తలు తీసుకొన్నారు? వీటికి సంబంధించిన నేమ్ బోర్డును ఏర్పాటు చేశారా? పెరిగిన మొక్కలను ఎక్కడెక్కడ నాటుతారు? ఎన్ని లక్షల పనులు జరిగాయి? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అదే విధంగా చెరువుల పూడికతీత అనేది ఎన్ని రోజులు జరిగింది? ప్రతి రోజు ఎంతమంది ఉపాధిహామీ కూలీలు హాజరవుతున్నారు? వారికి పేమెంట్లు ఎలా ఇస్తున్నారు? నేమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించారు. కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా గ్రామాల్లో ప్రధాన ద్వారాల్లో ఏ రకాలైన మొక్కలు నాటారు? ఏం జాగ్రత్తలు తీసుకొన్నారు?గ్రామ పంచాయతీల పరిధిల్లో ఈజీఎస్ పనులు అన్ని పూర్తయ్యాయా? గ్రామాల వారీగా ఉపాధి హామీల జాబ్ కార్డులను అప్డేట్ చేస్తున్నారా? గ్రామ పంచాయతీలో నిర్వహించే 7 రకాల రిజిస్టర్లను పకడ్బందీగా అన్ని విషయాలు, వివరాలను పొందుపరచి రాస్తున్నారా? లేదా అనే విషయాలను అడిగి పరిశీలించి తెలుసుకొన్నారు.
4 గ్రామాల్లో 5 రకాల పనులు..
మండలంలో 4 గ్రామాల్లో కలెక్టర్ ఆదేశాలమేరకు జాతీయ గ్రామీణాభివృద్ధిశాఖవారు ఇచ్చిన అంశాల ఆధారంగా ప్రతి గ్రామంలో 5 రకాల పనులను పరిశీలించారు. పనుల వివరాలు, వాటిలో సాధించిన ప్రగతి, పనుల పురోగతి, నిధుల వినియోగం, ఉద్దేశం, గామ పంచాయతీల సిబ్బంది పనితీరు, ఉపాధి హామీ పనుల వివరాలు, ప్రజలకు ఉపాధి హామీ పనులతో చేకూరుతున్న లాభాలు వంటి అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులకు ఓ నివేదికను అందిస్తామన్నారు. తనిఖీలతోనే ఇతర రాష్ర్టాల్లో ఈజీఎస్ నిధులతో పనులు చేపట్టనున్నారని వారు తెలిపారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచులు రుక్మిణమ్మ, ద్యావరి విజయమ్మ, రాములు, తులసి, జిల్లా అడిషనల్ డీఆర్డీవో స్టీవెన్ నిల్, ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో షేక్ సుష్మ, ఈసీలు సైదులు, కృష్ణ, అశోక్, టీఏ విజయ్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.