పరిగి, ఏప్రిల్ 23: మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మరింత బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎస్‌హెచ్‌జీలకు రుణ పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాం కు లింకేజీ ద్వారా రూ.441 కోట్ల రుణాలను మంజూరు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 12,273 మహిళా స్వయం సహాయక సంఘాలున్నాయి. ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి పొందుతున్న స్వయం సహాయక సంఘాలకు అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలోని దాదాపు 95 శాతానికిపైగా ఎస్‌హెచ్‌జీలు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నాయి.
జిల్లా పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో స్వయం సహాయక సంఘానికి బ్యాంకు లింకేజీ ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణాన్ని అందించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు 8,268 ఎస్‌హెచ్‌జీలకు రూ. 371 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు. 2020-21తో పోల్చితే రూ.6కోట్లు అదనంగా రుణాలను అందజేశారు. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.441 కోట్ల రుణాలను మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా మండలాల వారీగా ప్రతి ఏడాది రుణాల ను సకాలంలో చెల్లిస్తున్న ఎస్‌హెచ్‌జీలను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న గ్రామాల్లోని ఎస్‌హెచ్‌జీలకు రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి. కాగా గతేడాది ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.6 లక్షల నుంచి రూ.7లక్షల వరకు రుణాలను అందజేయగా… ఈ ఏడాది రూ.10 లక్షల చొప్పున అందించేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. బ్యాంకులు అందజేసే రుణాల నుంచి 20 శాతం సొంతానికి వాడుకున్నా, మిగతా 80 శా తం ఆదాయ అభివృద్ధికి సంబంధించిన వ్యాపా రం, వ్యవసాయ పెట్టుబడి, ఇతర వాటిలో వెచ్చించాల్సి ఉంటుంది. తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెండటంతోపాటు రుణాలను తిరిగి చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని 436 ఎస్‌హెచ్‌జీలకు 2022-23 ఆర్థిక సంవత్సరం లో రూ.19.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా రు. వికారాబాద్ మున్సిపాలిటీలో 153 ఎస్హె చ్జీలకు రూ.6.46 కోట్లు, తాండూరులో 162 సంఘాలకు రూ.6.72కోట్లు, పరిగిలోని 63 సంఘాలకు రూ.2.40 కోట్లు, కొడంగల్‌లో 58 ఎస్‌హెచ్‌జీలకు రూ.3.72 కోట్ల రుణాలను మం జూరు చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో నే రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నది.
జిల్లా పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరం లో బ్యాంకు లింకేజీ ద్వా రా స్వయం సహాయక సంఘాలకు రూ.441 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నాం. గతేడాది లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలను అందించాలని నిర్ణయించడం జరిగింది. రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న ఒక్కో సంఘానికి రూ.10 లక్షల చొప్పున మం జూరు చేస్తాం. ఇందులో 20 శాతం సొంతానికి వాడుకున్నా, మిగతా 80 శాతం ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి. తద్వా రా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ రుణాలను వినియోగించుకోవాలి.
-కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా