ఉన్నత చదువులు చదివిన యువత ప్రస్తుతం ఉద్యోగాల బాట పట్టకుండా ఆదాయ వనరులపై దృష్టిపెడుతున్నది. తమకు ఉన్న చదువు, తెలివి తేటలను పెట్టుబడిగా మలుచుకొని పల్లెబాట పడుతూ స్వయంగా ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నారు. తమ ఆలోచనలు, అభిరుచికి తగ్గట్టుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పల్లెల్లోనూ పరిశ్రమలు స్థాపించి సక్సెస్ అవుతూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్లెల్లో మారుతున్న కాలానుగుణంగా కోళ్లు, పాడి పశువులు, గొర్రెలు, మేకలు, డెయిరీ ఫామ్‌లు వెలుస్తున్నాయి. ఇప్పటికే పల్లెల్లో కోళ్లఫామ్‌లు, డెయిరీ ఫామ్‌లు వెలిసిన సంగతి అటు ఉంచితే.. ప్రస్తుతం గొర్రెల ఫామ్‌లు వెలుస్తున్నాయి. ఉత్సాహం, అభిరుచి గల యువత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మాంసం ఉత్పత్తులు, వ్యాపార మెళకువలు తెలుసుకొని గొర్రెల ఫామ్‌ల పరిశ్రమల వైపు అడుగులు వేస్తున్నారు.
ఆమనగల్లు, ఏప్రిల్ 23:మాడ్గుల మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో జెల్ల ఆంజనేయులు అనే యువకుడు సుమారు రూ.55 లక్షలను వెచ్చించి గొర్రెల ఫామ్‌ను స్థాపించాడు. ప్రస్తుతం ఫామ్‌లో 220 గొర్రె పొట్టేళ్లు ఉన్నాయి. వాటి పోషణకు వారి కుటుంబసభ్యుల సహకారం తీసుకోవడంతో పాటు గ్రామానికి చెందిన వారిని సహాయకులుగా పెట్టుకున్నాడు. గొర్రెల పోషణతోపాటు అవి అనారోగ్యానికి గురికాకుండా స్థానికంగా ఉండే పశువైద్యులను సంప్రదించి వాటి బాగోగులను చూసేలా వారితో ఒప్పందం చేసుకున్నాడు. ఆయా మండలాల్లో గొర్రెల ఫామింగ్లు విస్తారంగా వెలుస్తున్నాయి. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లోని పల్లెల్లో వీటి పోషణకు యువత ముందుకు వస్తున్నారు.
గొర్రెల ఫామ్‌లు ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగానే నాణ్యమైన మాంసం అందుబాటులోకి వస్తుంది. శుభ కార్యాలు, ఫంక్షన్లు, హోటళ్లు నిర్వాహకులు నేరుగా ఫామ్‌కే వచ్చి కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో వినియోగదారులకు మార్కెట్ ధరకంటే మంచి మాంసం అందడంతోపాటు ఫామ్ నిర్వాహకులకు మార్కెట్ ఇబ్బందులు తప్పుతుంది. సాధారణ పద్ధతులతో పోల్చితే షిఫ్ ఫామింగ్ విధానంలో గొర్రెల నుంచి ఎక్కువ మాంసం ఉత్పత్తి అవుతుంది.
ఒకప్పుడు గొర్రెలు, మేకలు మందలాగా పల్లెల్లో కనపడేవి. వాటిని కాస్తూ కాపరులు ఉపాధి పొందేవారు. కానీ అడవుల విస్తీర్ణం తగ్గడం, పంట పొలాలకు గొర్రెలు, మేకలు రాకుండా పంట యజమానులు నిబంధనలు పెట్టడం వల్ల వాటి పోషణ కాపరులకు భారంగా మారింది గొల్లకుర్మల పిల్లలు కూడా వాటిని కాసేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో పల్లెల్లో గొర్రెలు, మేకల పోషణ పూర్తిగా తగ్గింది. దీంతో పల్లెల్లోకి కొత్తగా గొర్రెల ఫామ్‌లు వచ్చాయి. గొర్రెలకు ప్రత్యేకంగా షెడ్లువేసి వాటి పోషణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా గొర్రె, కుర్మల పిల్లల యువతను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రత్యేకంగా గొర్రెలు పెంపకం కోసం ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి గొర్రెల ఫామ్‌లు ఏర్పాటుకు సహకారం అందిస్తుంది. ఒక్కో ఫామ్‌కు 100 నుంచి 150 గొర్రెలను పంపిణీ చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తుంది.
మంచి ఆదాయ వనరుగా మారింది. పట్టణాల్లో ఉద్యోగాలు చేసి ఇబ్బందులు పడేకంటే స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో ఫామ్‌పై దృష్టి పెట్టా. పెండ్లిలు, వారాంతంలో మంచి ఆదాయం వస్తున్నది. వినియోగదారులు నేరుగా ఫామ్‌కే వచ్చి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందించి మంచి గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో వ్యాపారం చేస్తున్నా. నాతోపాటు మా కుటుంబసభ్యులు ఫామ్ నిర్వహణ చూస్తున్నారు. మొదట కొంత ఇబ్బందులు పడ్డాం.. కాని గొర్రెల ఫామ్‌లు ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత మంది ఈ రంగం వైపు వస్తారు.
– ఆంజనేయులు, గొర్రెల ఫామ్ నిర్వాహకుడు, బ్రహ్మణపల్లి