కూలీలకు ఉపాధి హామీ పని కల్పించడంపై వికారాబాద్ జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పనులను గుర్తించడం మొదలు కూలి డబ్బులు చెల్లించే వరకూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజుకు లక్ష మందికిపైగా పని కల్పిస్తున్నారు. అత్యధిక మందికి పని కల్పించడంలో మన జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గత కొన్ని రోజులుగా ఉపాధి పనులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మే నెలలో మరింత మంది కూలీలు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 74.76లక్షల పని దినాలు కల్పించేందుకుగాను రూ.181.39కోట్ల లేబర్ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ మేరకు కూలీలందరికీ పని కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా జిల్లాలో మొత్తం 2,00069 మందికి ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్నాయి.
పరిగి, ఏప్రిల్ 21: పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా వారి ఆర్థిక ప్రగతికి సర్కారు దోహదం చేస్తున్నది. ఇందుకోసం గ్రామ స్థాయి నుంచి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. ఉపాధి హామీ పథకం కూలీలకు పని కల్పిస్తూ, అత్యధికంగా కూలీలు పనిచేస్తున్న జిల్లాల్లో రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కొద్ది రోజులుగా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మొదలుకొని గ్రామ స్థాయి వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడికక్కడ పనులను కల్పించడం ద్వారా ఇప్పటికే రోజువారీగా పనికి వస్తున్న కూలీల సంఖ్య లక్షను దాటింది. జిల్లా పరిధిలో 2022-23 సంవత్సరానికి లేబర్ బడ్జెట్‌ను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. చేపట్టాల్సి న పనులను గ్రామసభల్లో గుర్తించి, వాటిని ఎంతమంది కూలీలతో ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో ఇప్పటికే నిర్ణయించారు. 2022-23లో జిల్లాలో 74.76 లక్షల పనిదినాలను కల్పించేందుకు లేబర్ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ బడ్జెట్ ఆధారంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనులను కూలీలతో చేయించనున్నారు. జిల్లాలో 2,00,069 మందికి ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్నాయి. వారికి పూర్తిస్థాయిలో పని కల్పించడమే లక్ష్యంగా గ్రామీణాభివృద్ధ్ది శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.181.39 కోట్ల విలువైన పనులు కూలీలతో చేయించనున్నారు.
ఉపాధిహామీలో చేపట్టనున్న పనులను గ్రామసభల్లో ఎంపిక చేస్తారు. జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ల అధ్యక్షతన గత అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30వ తేదీవరకు గ్రామసభలను ఏర్పాటుచేసి చేపట్టనున్న పనులను ఎంపిక చేశారు. ఇందులో భూమి చదును చేసే పనులు, మట్టి కట్టలు, చెరువుల్లో పూడికతీత, మేకలు, గొర్రెల షెడ్డుల నిర్మాణం, నర్సరీ, మళ్లింపు కాల్వలు, నీటికుంటలు, పశువుల పాకలు, చెక్‌డ్యాంలలో పూడికతీత పనులు, పంట కల్లాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా గ్రామసభల్లో గుర్తించిన మరిన్ని పనులను కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక రోజులో గరిష్ఠంగా లక్షా 25వేల మంది కూలీలకు పని కల్పిం చనున్నారు. జిల్లాలో జాబ్‌కార్డులు గల ఉపాధి కూలీల సంఖ్య రెండు లక్షల పైగా ఉండగా ఇటీవలికాలంలో ఉపాధి పనులు ఊపందుకున్నాయి. రోజురోజుకూ కూలీల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలో పనిచేస్తున్న రోజు వారీ ఉపాధి కూలీల సంఖ్య లక్ష మందిని దాటింది. రాష్ట్రంలో అత్యధికంగా కూలీలు పనిచేస్తున్న జిల్లాల్లో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉండగా, వికారాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. గరిష్ఠంగా లక్షా25 వేల మంది వరకు కూలీలు పనులు చేసేందుకు వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెలలో పనులతోపాటు రోజువారీగా పనికి వచ్చే కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ పనులు ఉం డటంతో కొంతమంది రావడంలేదు. వేసవి దృష్ట్యా మంచినీటి కోసం ప్రతిరోజూ ఒక్కొక్కరికి రూ.5 చొప్పున చెల్లిస్తుండగా నీడ సదుపాయం కల్పించాలని అధికారులు సర్పంచ్‌లకు సూచించారు. అలాగే చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స కోసం గ్రామపంచాయతీ వారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను కూడా పనిచేసే చోట సిద్ధంగా ఉంచాలని సూ చించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ప్రస్తుతం లక్ష మందికి పైగానే కూలీలు రోజువారీగా పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్య మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉంది. పనిచేసే ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే గ్రామపంచాయతీలకు సూచించడం జరిగింది. జిల్లాలోని ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్న వారందరికీ పని కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
-కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా