సీఎం కేసీఆర్.. ప్రజలకు మాట ఇచ్చారంటే అది శాసనమే! హామీ ఇచ్చే ముందే ఒకటికి రెండు సార్లు మథనం… ఆపై అమలుకు ముందు సుదీర్ఘ కసరత్తు… చివరకు మాటను నిలబెట్టుకుంటూ ప్రకటన. ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో అనేకసార్లు రుజువైన అంశం… తాజాగా 111 జీవో రద్దు విషయంలోనూ అమలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనూ పలువురు పాలకులు ప్రజలకు దీనిపై హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడంలో కనీస కసరత్తు చేయలేకపోయారు. చివరకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ చేతులెత్తేశారు. కానీ సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే జీవో 111 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దానికి ముందు ఆయన చేసిన కసరత్తు, మథనం అంతా ఇంతా కాదు. కాగా జీవో రద్దు నేపథ్యంలో హైదరాబాద్ నగరాభివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకుపోనుంది. నగరం నైరుతి వైపు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ఒకే ఒక్క 111 జీవో రద్దు కావడంతో భూ బ్యాంకు కూడా గణనీయంగా పెరుగుతుంది. 84 గ్రామాల్లోని ప్రజలతో పాటు నగరాన్ని నమ్ముకొని వచ్చే సామాన్య, మధ్య తరగతి ప్రజలకూ నిర్మాణ రంగంలో ఊరట కలుగుతుంది. అందుకే 111 జీవో పరిధిలోని గ్రామాల్లో సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 1996 నుంచి జీవో 111 ఆంక్షలు మొదలైన విషయం తెలిసిందే. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు పది కిలోమీటర్ల రేడియస్‌లోని ఈ గ్రామాల్లో విధించిన అంక్షలతో భూమి విస్తీర్ణంలో కేవలం పది శాతంలో మాత్రమే శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఉంది. గ్రామాల పరిధిలో చేసే లేఅవుట్లలోనూ 60 శాతం మేర ఓపెన్ స్పేస్, రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా నగరానికి చేరువలో ఉండి… అభివృద్ధి ఆ గ్రామాలను దాటిపోతున్నా… 84 గ్రామాల పరిధిలోని 1,32,600 ఎకరాల భూములు కేవలం వ్యవసాయ, వినోద (రెసిడెన్షియల్, రిక్రియేషన్) జోన్లకు పరిమితమై ఇతర రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. తద్వారా భూముల విలువ పక్కనే ఉన్న భూముల కంటే అత్యంత తక్కువగా ఉండటంతో పాటు ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ ఆ గ్రామాల్లోని యువతకు స్థానికంగా అవకాశాలు లేకుండా పోయాయి.
111 జీవోను ఎత్తివేస్తామని ఉమ్మడి ఏపీలోనూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ జీవో ఎత్తివేసేందుకు మార్గాన్ని సుగమం చేయకుండా… కనీస కసరత్తు కూడా చేపట్టలేదు. దీంతో వైఎస్ ఇచ్చిన హామీ నీటి మీద రాతల్లాగానే మారింది. కానీ సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ‘111 జీవోను ఎత్తివేస్తాం’ అని ప్రకటించారు. ఆ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల భరోసా కల్పించారు. మరోవైపు కృష్ణాజలాల సరఫరాలోనూ సుంకిశాల పథకంతో శాశ్వత పరిష్కారాన్ని చూపారు. ఇలా రెండు జీవనదుల నుంచి హైదరాబాద్ మహా నగరానికి రానున్న వందేండ్లలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జంట జలాశయాల నుంచి తాగునీటి సరఫరా అవసరాన్ని లేకుండా చేశారు. ఇలా చర్యలు చేపట్టిన తర్వాతనే 111 జీవో రద్దుపై నిర్ణయం తీసుకున్నారు.
84 గ్రామాల పరిధిలో 111 జీవో ఎత్తివేతతో నగరానికి ఆనుకొని ఉన్న ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అభివృద్ధి
పరుగులు పెడుతుంది.
111జీవో ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఈ జీవోతో మా గ్రామాల్లోని ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు పడ్డాం. మా మండలంలో రెండు గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సోలీపేట్, మద్దూర్ గ్రామాల ప్రజలకు జీవో ఎత్తివేతతో లబ్ధి చేకూరనుంది. ఇక్కడి భూములకు విలువ పెరిగి, గ్రామాలు అభివృద్ధి అవుతాయి.
– రాంచంద్రారెడ్డి, సోలీపేట్, షాబాద్
111 జీవో ఎత్తివేతతో మా ప్రాంతానికి పరిశ్రమలు, కంపెనీలు వస్తాయి. దీంతో ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి విస్తరించి.. భూముల విలువలు పెరుగుతాయి. ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
– ప్రశాంత్, ఎన్కేపల్లి గ్రామం, చేవెళ్ల మండలం
మా ప్రాంత ప్రజలకు 111 జీవో అతి పెద్ద సమస్య. సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏండ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో మాకు సంతోషంగా ఉంది. జీవో ఎత్తివేతతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది సీఎం కేసీఆర్ చలవే.
– ఎం.అనిల్, ఎన్కేపల్లి గ్రామం, చేవెళ్ల మండలం
రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను ఎత్తివేస్తామని కేబినేట్లో నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి జీవోను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం జీవోను ఎత్తివేస్తామని కేబినేట్లో నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడు…జీవో 111 ఎత్తివేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.
– ఎంఏ షుకూర్, మొయినాబాద్