కొడంగల్, ఏప్రిల్ 5 : శ్రీ మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన రథోత్సవం మంగళవారం నయనానందకరంగా కొనసాగింది. ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి వారికి శేషవస్త్రం అందించబడుతుంది. మూలవిరాట్టుకి టీటీడీ నుంచి అందించిన మేల్శాత్, కీల్శాత్ శ్రీవారి వస్త్రంతో అలంకరించడం రథోత్సవ ప్రత్యేకత. అనంతరం సర్వాంగ సుందరంగా వివిధ రంగురంగుల పుష్పాలతో అలంకరించిన బంగారు వర్ణ రథంపై శ్రీదేవీ, భూదేవి సమేతుడై స్వామివారి కొలువుదీరి ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ వీధుల్లో ఊరేగుతూ జాతర మైదానానికి బయలుదేరారు. స్వామిని దర్శించుకునేందుకు బాలాజీ వీధి భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలు స్వామి వారికి మంగళ హారతులిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ఎద్దులతో బండలాగుడు పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ ఎద్దుల ప్రతిభను ప్రదర్శించారు. మొదటి బహుమతి 25 తులాల వెండి కడియాలను దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజు ప్రభాకర్, రెండో బహుమతిగా 15 తులాల వెండి కడియాలను సాయిప్రసన్నకృష్ణంరాజు, మూడో బహుమతి 10 తులాల వెండి కడియాలను శంకర్‌నాయక్ సమకూర్చారు. ప్రథమ బహుమతి డి.వెంకటయ్య (కొడంగల్), ద్వితీయ బహుమతి కుర్వ వెంకటయ్య (చిల్ముల్మైల్వార్) తృతీయ బహుమతి మద్దూర్ శేఖర్(గుండ్లకుంట)లకు వారు బహుమతులను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీనివాసుడు సేద తీరే కార్యక్రమంలో భాగంగా భూదేవీ, శ్రీదేవీ సమేతంగా శ్రీవారికి ఆలయ ప్రాంగణంలోని ఆస్థానంలో అభిషేక కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం ఊంజల్ మండపంలో ఉయ్యాల సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పలు నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు.