పరిగి, ఏప్రిల్ 5: పల్లెల్లో పచ్చదనం వెల్లివిరియాలని.. గ్రామీణ ప్రాంతాల్లోని ఊరూవాడ హరితమయం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాల్లో హరితహారం ఒకటి. సీఎం కేసీఆర్ హరితహారం కింద మొక్కలు నాటించి, పచ్చదనం పెంపునకు పెద్దపీట వేస్తున్నారు. మరోవైపు అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. చెట్లు నరికివేతకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతోపాటు అటవీ ప్రాం తంలో వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన అవసరమైన రక్షణ చర్యలను కూడా అధికారులు తీసుకుంటున్నా రు. అంతేకాకుండా వేసవిలో అటవీ జంతువులకు నీటి ఇబ్బందులను తీర్చేందుకు ప్రత్యేకంగా సాసర్పిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో నీటిని నింపేందుకు నాలుగు సోలార్ బోర్‌వెల్స్ ద్వారా నీటి ని సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా వేసవిలో నీటిని తాగేందుకు ఏఏ జంతువులు వస్తున్నాయో గుర్తించేందుకు జిల్లాలోని పలుచోట్ల ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో 1,08,000 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉండగా.. ఇందులో వివిధ రకాల జంతువులు నివసిస్తున్నాయి.
వేసవిలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతంలో 120 సాసర్పిట్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సాసర్ఫిట్లలో ప్రతి 15 రోజులకొకసారి చొప్పున నీటిని నింపుతారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో.. నీటి వినియోగం అధికంగా ఉండే ప్రాంతాల్లో తరచూ వాటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నారు. దీంతోపాటు జిల్లాలోని నాలుగుచోట్ల ప్రత్యేకంగా సోలార్ బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేసి వాటితో సాసర్పిట్లు, ట్యాంకుల్లో నీటిని నింపుతారు. తద్వారా ప్రతిరోజూ అటవీ జంతువులు నీటిని తాగేందుకు అనుకూలంగా ఉంటుంది. నస్కల్ అటవీ ప్రాంతంలో రెండు, అనంతగిరిలో ఒకటి, ఇబ్రహీంపూర్ అటవీ ప్రాం తంలో ఒకటి చొప్పున సోలార్ బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేశారు.
అటవీ ప్రాంతంలోని పలు చోట్ల, అటవీ జంతువులు నీటిని తాగేందుకు ఏర్పాటు చేసిన సాసర్పిట్లు, నీటి ట్యాంకుల వద్ద ట్రాప్ కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి రేంజ్‌కు ఐదు చొప్పున, జిల్లావ్యాప్తంగా 25 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో నీటిని తాగేందుకు వచ్చే అటవీ జంతువుల కదలికలు ఇందులో రికార్డు అవుతాయి. తద్వారా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏఏ జంతువులు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఇప్పటివరకు జిల్లాలోని అడవుల్లో జింకలు, అడవిపందు లు, కొండగొర్రెలు, సాంబార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ఎవరైనా వేటగాళ్లు అడవిలోకెళ్లినా ఈ ట్రాప్ కెమెరాల్లో రికార్డు అవుతుంది. తద్వారా అటవీ, అటవీ జంతువుల రక్షణకు ట్రాప్ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయి.
వేసవికాలంలో అడవిలో ఎండిన ఆకులు ఉంటుండటంతో మంటలు అంటుకునే అవకాశాలు ఎక్కువ. బాటసారులు, వాహనదారులు కాల్చిన సిగరెట్లు, బీడీలను ఆ ప్రదేశాల్లో పడేస్తే నిప్పంటుకొని వృక్షాలతోపాటు జంతువులకు నష్టం జరుగుతుంది. అందువల్ల మంటలు అంటుకోకుండా, ప్రమాదాలు జరుగకుండా అటవీ శాఖ అధికారులు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 130 కిలోమీటర్ల పరిధిలో ఫైర్ కంట్రోల్ లైన్స్‌ను ఏర్పాటు చేయించారు. ఈ ఫైర్ కంట్రోల్ లైన్స్ ద్వారా ఎక్కడైనా అకస్మాత్తుగా మంటలు అంటుకుంటే అడవి మొత్తం అవి వ్యాపించకుండా అడ్డుకుంటాయి. మరోవైపు ముందు జాగ్రత్తగా ఆకులు, చెత్తను కాల్చివేయడం జరుగుతుంది. అటవీ శాఖ అధికారులు తీసుకున్న చర్యలతో అగ్నిప్రమాదాలు సంఖ్య చాలావరకు తగ్గింది. గత ఆరు నెలల కాలంలో 46 అగ్నిప్రమాదాలు జరుగగా, అటవీ శాఖ అధికారులు వాటిని వెంటనే ఆర్పివేసి, ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. నస్కల్, అనంతగిరి, గిరిగిట్‌పల్లి, కండ్లపల్లి, నాగులపల్లి తదితర ప్రాంతాల్లో గడ్డి భూములు ఉండటంతో వేసవిలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
వేసవిలో అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లాలో 1,08,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న అట వీ ప్రాంతంలో 120 సాసర్పిట్లను ఏర్పాటు చేశాం. జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సోలా ర్ బోర్‌వెల్స్‌తో ఎప్పటికప్పుడు ట్యాంకులు, సాసర్పిట్లలో నీటిని నింపుతున్నాం. వేసవిలో ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు 130 కిలోమీటర్ల పరిధిలో ఫైర్ కంట్రోల్ లైన్స్‌ను ఏర్పాటు చేశాం. వాటితో అడవితోపాటు జంతువుల రక్షణకు ఉపయోగపడుతుంది. -వేణుమాధవరావు, వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి