ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5: ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా శిథిల భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలకు పక్కా భవనాలను నిర్మించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నియోజకవర్గంలో రూ. 15.50 కోట్లతో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించగా ఆ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కొన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురాగా…మరికొన్ని భవనాలకు ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం డివిజన్‌గా ఏర్పడినా ఇక్కడ ఆర్డీవో కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో తుర్కయాంజాల్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆర్డీవో కార్యాలయాన్ని ఇబ్రహీంపట్నానికి తీసుకురావాలన్న సంకల్పంతో ఓ ప్రైవేట్ సంస్థ నుంచి ఈ భవన నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులను తీసుకొచ్చి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలో చేపట్టిన భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా పలు ప్రైవేట్ సంస్థల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు మరో రూ.1.50 కోట్ల నిధులను తీసుకొచ్చారు. ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాల యం కూడా ప్రైవేట్ భవనంలోనే సాగుతున్నది. అలాగే.. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. ఈ భవనంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
దీంతో ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.1.50 కోట్లను తీసుకురాగా.. పనులు చురుగ్గా సాగుతున్నాయి. తుర్కయాంజాల్ మున్సిపల్ కార్యాలయానికి కూడా సరైన భవనం లేకపోవటంతో పాలకవర్గ సమావేశాలు నిర్వహించటం ఇబ్బందికరంగా మారుతు న్నది. ఈ మున్సిపాలిటీ నూతన కార్యాల య భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ రూ.మూడు కోట్లను కేటాయించి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఇబ్రహీంప ట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం కూడా గత 30 ఏండ్లుగా సొంత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతున్నది. ఈ కార్యాలయానికి కూడా నూతన భవనాన్ని నిర్మించాలని రూ.1.50 కోట్లతో ఇబ్రహీంపట్నం పాత బస్టాండు వద్ద నూతనంగా భవన నిర్మాణ పనులను చేపట్టారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలోనూ రూ. నాలుగు కోట్లను ప్రైవేట్ సంస్థ నుం చి తీసుకొచ్చి శాశ్వత భవన నిర్మాణ పనులను చేపడుతున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల చిరకాల స్వప్నం నెరవేరుతున్నది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొన్నేండ్లుగా పక్కా భవనాల్లేక పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇరుకైన అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరడంతో ఆ భవనాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం గత 30 ఏండ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతున్నది. ఆర్డీవో కార్యాలయానికి కూడా పక్కా భవనం లేకపోవడంతో తుర్కయాంజాల్ నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నా రు. త్వరలోనే ఇబ్రహీంపట్నంలో ఆర్డీవో కార్యాలయ నూ తన భవనాన్ని ప్రారంభించి ఇక్కడి నుంచే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటా. ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలోనూ రోగుల అవసరాలను అనుగుణంగా పక్కా భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నా.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం