తాండూరు రూరల్, మార్చి 23 : భూగర్భ జలాలను పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా వాగుపై 7 చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏడు చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.47కోట్ల82లక్షల51వేల నిధులు మంజూరు చేసింది. కొవిడ్ కారణంగా గతంలో పనులకు ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా గతంలో కురిసిన వర్షాల కారణంగా కూడా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం చెక్‌డ్యాంల నిర్మాణానికి అనువైన కాలం కావడంతో ఇరిగేషన్ అధికారులు చెక్‌డ్యాంల నిర్మాణ పనుల్లో వేగం పెంచారు.
తాండూరు మండలం చిట్టిఘనాపూర్ కాగ్నా వాగుపై రూ.6కోట్ల47లక్షల50వేలు, ఎల్మకన్నె కాగ్నా వాగుపై నిర్మించే మరో చెక్ డ్యాంకు రూ.8కోట్ల4లక్షల91వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు చెక్ డ్యాంల పనులు ప్రారంభమయ్యాయి. బషీరాబాద్ మండలంలోని జీవన్గీ వాగుపై నిర్మించే చెక్‌డ్యాంకు రూ.8కోట్ల74లక్షలు, క్యాద్గీర సమీపంలో నిర్మించే చెక్‌డ్యాంకు రూ.5కోట్ల69లక్షల10వేలు, పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి గేట్ సమీపంలో నిర్మించే డ్యాంకు రూ.3కోట్ల50లక్షలు, యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని మంజీరా సంఘం సమీపంలో నిర్మించే చెక్ డ్యాంకు రూ.9కోట్ల62లక్షలు, గోవింద్రావుపేటలో నిర్మించే చెక్‌డ్యాంకు రూ.5కోట్ల75లక్షలు మంజూరు చేసింది. బషీరాబాద్ మండలంలోని జీవన్గీలో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో ఏడు చెక్ డ్యాంలు పూర్తయితే సుమారు 1,220 ఆయకట్టు రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం చేకూరనుంది. ఆయా ప్రాంతాల్లోని గ్రామాల రైతులకు బోర్లలో భూగర్భ జలాలు పెరిగిపోతాయి. అంతేకాకుండా సంవత్సరంలో రెండు, మూడు పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగనుంది.
ప్రసుత్తం తాండూరు మీదుగా పారుతున్న కాగ్నా వాగులోని నీరు కర్ణాటకలోని పలు వాగుల్లోకి వెళుతున్నది. తాండూరు ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు లేవు. ఈ ప్రాంత రైతాంగం వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు కంది, మినుము, పెసర, జొన్న, కుసుమ ఇతర వర్షాధార పంటలు సాగు చేస్తారు. కాగ్నా నీరు తాండూరు రైతాంగానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో వాగుపై ఏడు చెక్ డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ భారీగా నిధులను మంజూరు చేశారు. ఇరిగేషన్ అధికారులు మిగతా 5 చోట్ల చెక్ డ్యాంల నిర్మాణ పనులపే చేయించేందుకు సిద్ధమవుతున్నారు.
తాండూరు ప్రాంతంలో చేపట్టే ఏడు చెక్ డ్యాంల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల వల్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. పరిస్థితులు మెరుగుపడుతున్నందున చెక్ డ్యాంల పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.
వికారాబాద్, మార్చి 23 : ఆహార, పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించనున్నామని డీఆర్డీవో కృష్ణన్ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని స్త్రీ శక్తి భవన్లో ఫుడ్ ప్రాసెసింగ్, కుటీర పరిశ్రమలపై లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార తదితర పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నవారికి ప్రోత్సాహకంగా శిక్షణలు ఇస్తామని తెలిపారు. నాణ్యమైన ఆహారం తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం వంటి వాటిపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. లోన్స్, సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద 2020లో రూ.10వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని పలువురికి అవగాహన కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆహార సాంకేతిక మేనేజర్లు ప్రభంజన్, తేజ, డీపీఎం అండ్ డీఎల్టీ ఎస్.శ్రీనివాస్, ఏపీఎం కమలాకర్, డీఆర్పీ సాహేల్, ఫుడ్ ప్రాసెసింగ్ కుటీర పరిశ్రమ లబ్ధిదారులు పాల్గొన్నారు.