తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రకటించింది. దీంతో డబ్బులున్నవారు కోచింగ్ సెంటర్లకు వెళ్తుండగా, పేదవారు ఆలోచనలో పడ్డారు. పేద అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దన్న సదుద్దేశంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తన కూతురు జ్యోతి జాపకార్థం షాద్‌నగర్ పట్టణంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించారు. దీంతో నిరుద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చింది. కోచింగ్‌తో పాటు మధ్యాహ్న భోజనం పెడుతుండడంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
షాద్‌నగర్ టౌన్, మార్చి 23 : సర్కారు నౌకరి సాధించడం భవిష్యత్తుకు బంగారు బాట. అలాంటి కలను నిజం చేసుకునేందుకు నిరుద్యోగులు పోటీ పడుతుంటారు. రేయింబవళ్లు కష్టపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. నిరుద్యోగుల కల నెరవేర్చేందుకు తెలంగాణ సర్కార్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా 80039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగార్థులంతా గ్రంథాలయాలతో పాటు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఉద్యోగ సాధన కోసం పట్టుదలగా చదువుతున్నారు. పేద అభ్యర్థులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ తన కూతురు జ్యోతి జ్ఞాపకార్థం షాద్‌నగర్ పట్టణంలోని ఠాగూర్ పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనంతో కూడిన ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా తరగతులకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు వస్తుండడం విశేషం. నాణ్యమైన బోధనతో పాటు భోజన సౌకర్యం కల్పిస్తుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులచే గ్రూప్ 2, 3, 4, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందే నుంచి విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చిందని, సుమారు 500 మంది విద్యార్థులకు పైగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటున్నారని స్థానిక నాయకులు తెలిపారు. పోటీ పరీక్షలకు పోటీ పడే విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌కు నిరుద్యోగులు కృతజ్ఞతలుతెలుపుతున్నారు.
ఉచిత శిక్షణ తరగతుల్లో మాకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఈ శిక్షణ మాకు ఎంతో మేలు చేస్తున్నది. శిక్షణతో పాటు మంచి మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తా. ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ గారికి కృతజ్ఞతలు.
– కవిత, షాద్‌నగర్
ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించడం సంతోషంగా ఉన్నది. గ్రూప్స్‌నకు సంబంధించి బాగా చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే నా లక్ష్యం. ఉచిత శిక్షణను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గారికి రుణపడి ఉంటా.
– ఎస్.రాజు, షాద్‌నగర్
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేదల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి. పట్టుదలగా చదివి ఉద్యోగం సాధించి తమ కలను నెరవేర్చుకోవాలి. సాధించాలన్న కసి ఉంటే తప్పకుండా నౌకరీ సాధిస్తారు.
– చీపిరి రమేశ్‌యాదవ్, టీఆర్ఎస్ సోలిపూర్ గ్రామ అధ్యక్షుడు, షాద్‌నగర్