యాచారం, మార్చి23: మొన్న రెండు లేగదూడలు, నిన్న పాడి ఆవు, నేడు మేకపోతులను మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఓ చిరుత గ్రామస్తులను తీవ్రంగా కలవర పెడుతుంది. తాటిపర్తి అటవీ ప్రాంతలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతున్నది. వరుసగా మూగజీవాలపై విరుచుకుపడుతూ దాడులు చేస్తున్నది. పొద్దునే పొలాలకు వెళ్లాలన్నా, తిరిగి పొద్దు పోయాక పొలం వద్ద ఉండాలన్నా రైతులు, జీవాల కాపరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఆరు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పశువుల పాకలపై, మేకల మందలపై దాడులు చేసింది. అధికారులు ఎంత ప్రయత్నించినా చిరుత చిక్కలేదు. తాజాగా తాటిపర్తి గ్రామం నక్క జంగయ్యకు చెందిన మేకల మందపై చిరుత మంగళవారం రాత్రి దాడి చేసి మేకపోతును చంపింది. గమనించిన రైతు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో సర్పంచ్ దూస రమేశ్ ఫారెస్టు అధికారులకు తెలిపాడు. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడ చిరుత కోసం బోను ఏర్పాటు చేసి, దాని కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు.
ఆరు రోజుల్లోనే ఒకే ప్రాంతంలో బైకని జంగయ్యకు చెందిన రెండు లేగదూడలు, దొడ్డి యాదయ్యకు చెందిన పాడి ఆవు, నక్క జంగయ్యకు చెందిన మేకపోతును చిరుత చంపేసింది. ఇప్పటికే 30కి పైగా మూగజీవాలను చిరుత బలితీసుకున్నది. చిరుతను పట్టుకునేందుకు కొన్ని నెలలుగా ముమ్మరంగా యత్నిస్తున్నామని, నాలుగేండ్లుగా తమకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ముప్పు తిప్పలు పెడుతుందని ఫారెస్టు అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దింపి ఎలాగైనా చిరుతపులిని పట్టుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. చిరుత సంచారంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టాలని సర్పంచ్ కోరుతున్నారు. ఈనెల 25, 26, 27తేదీల్లో తాటిపర్తి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన తాటికుంట మైసమ్మ జాతర ఉన్నది. జాతర ఏర్పాట్లను చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు జంకుతున్నారు. చిరుత దాడులు చేస్తున్న ప్రాంతాలు గుడికి సమీపంలో ఉండటంతో భక్తులు, గ్రామస్తులు సైతం దిగులు చెందుతున్నారు.