కోట్‌పల్లి, మార్చి 12 : పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నది. ప్రతి పల్లెను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జిల్లాలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, ఖాళీ స్థలాల్లో, రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటడం, వీధి లైట్లు వేయించడం, చెత్త సేకరణ తదితర కార్యక్రమాలతో పల్లెల రూపురేఖలు మారాయి. నేడు గ్రామీణ ప్రాంతాల్లోని వీధుల్లో పంచాయతీరాజ్, డీఎంఎఫ్టీ, ఎన్ఆర్ఈజీఎస్ శాఖల నుంచి అధిక నిధులను కేటాయించి సీసీ రోడ్లను వేయిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, నిరుపేదలకు ఆర్థిక చేయూతనివ్వడానికి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకు సర్కారు అధిక ప్రాధాన్యతనిస్తుంది. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు వైకుంఠధామాలు, నర్సరీ, చెత్తను తరలించేందుకు డంపింగ్ యార్డులు, ఆహ్లాదకరంగా మార్చేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
పల్లె ప్రగతితో పల్లెల్లో, వీధుల్లో సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం, నిత్యం ఉదయం చెత్తను సేకరించడం, మురుగు కాల్వల్లో చెత్తను తొలగించడంతో పల్లెలన్నీ ప్రతినిత్యం పరిశుభ్రంగా మారాయి. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకు గ్రామాల్లోకి చేరుకుని అభివృద్ధి పనులను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులను వెచ్చిస్తూ పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. దళితులను అభివృద్ధి చేసేందుకు దళితబంధు, పేదలను కల్యాణలక్ష్మితో ఆదుకోవడం, రైతులకు రైతుబంధు, రైతుబీమా, వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టి నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.
– ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ, కోట్‌పల్లి