బొంరాస్‌పేట, మార్చి 12 : ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం అందిస్తున్నది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదలుకుని జడ్పీ చైర్మన్ల వరకు నెలకు కొంత మొత్తాన్ని గౌరవ వేతనంగా చెల్లిస్తున్నది. ఈ వేతనాన్ని రెండుమూడు నెలలకోసారి పలు పద్ధతుల్లో అందజేస్తున్నారు. అయితే ఈ గౌరవ వేతనాన్ని ఇక నుంచి వారి వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం వల్ల సర్పంచ్‌లకు గౌరవ వేతనం అందడంలో జాప్యం జరుగుతున్నందున దానిని నివారించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అధికారులు సర్పంచ్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి జిల్లా అధికారులకు పంపించారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు గౌరవ వేతనం చెల్లించే విధానం 1990 నుంచి అమల్లో ఉన్నది. అప్పట్లో ప్రభుత్వం సర్పంచ్‌లకు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుంటే, గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరో రూ.500 కలిపి మొత్తం రూ.1,000 సర్పంచ్‌లకు చెల్లించేవారు. ఆ తరువాత గౌరవ వేతనం రూ.5వేలకు పెరగగా, 2021 జూలైలో రూ.1500 పెంచి రూ.6,500 చెల్లిస్తున్నది. ప్రభుత్వం సర్పంచ్ల గౌరవ వేతనం గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసేది. అయితే తెలంగాణ వచ్చిన తరువాత ఈ విధానంలో మార్పు చేసి గౌరవ వేతనాన్ని ఎంపీడీవోల జీరో అకౌంట్‌కు జమ చేసేవారు. ఎంపీడీవోలు గౌరవ వేతనాలు మంజూరైన తరువాత చెక్కును ఎస్టీవోకు ఇస్తే అక్కడి నుంచి సర్పంచ్ల ఖాతాల్లోకి వెళ్లేది. ఈ విధానం వల్ల ఒక్కోసారి జాప్యం జరిగి వేతనాలు త్వరగా అందేవికావు. ఈ జాప్యాన్ని నివారించడానికి ప్రభు త్వం నేరుగా పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచే ఆన్లైన్ విధానంలో సర్పంచ్ల ఖాతాల్లోకి గౌరవ వేతనాన్ని జమ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్పంచ్ల అందరి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి ఇవ్వాలని ఎంపీవోలకు ఆదేశాలు ఇవ్వగా.. ఎంపీవోలు జిల్లాలోని 566 గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఖాతాల వివరాలు సేకరించి పంపించారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు అందిస్తున్న గౌరవ వేతనాన్ని ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 566 మంది సర్పంచ్ల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి పంపించాం. జనవరి నెల నుంచే గౌరవ వేతనం జమకావాల్సి ఉంది. త్వరలో గౌరవ వేతనం సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతుంది.
– మల్లారెడ్డి, డీపీవో, వికారాబాద్ జిల్లా
సర్పంచ్ల గౌరవ వేతనాన్ని నేరుగా ప్రభుత్వమే ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించడం మంచి నిర్ణయం. గతంలో గౌరవ వేతనం మంజూరైతే ఎంపీడీవోల నుంచి ఎస్టీవోలకు చెక్కులు వెళ్లి అక్కడ చెక్కులు పాస్ అయ్యి ఖాతాల్లో జమ అయ్యేసరికి చాలా రోజుల సమయం పట్టేది. ఇప్పుడు నేరుగా ఆన్లైన్ విధానంలో సర్పంచ్ ఖాతాల్లో జమ చేయడం వల్ల వేతనం మంజూరైన వెంటనే ఖాతాల్లో జమై సర్పంచ్‌లకు అందుతుంది.
– చాంద్‌పాషా, బొంరాస్‌పేట మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, బొంరాస్‌పేట