గుట్టను తొలిచి గుడిగా మలిచాడు ఓ సామాన్య పశువుల కాపరి పరమయ్యదాసు. ఒకప్పుడు పులులు సంచరించడంతో ఈ ప్రాంతాన్ని పులిలొంకగా పిలిచేవారు. ఈ గుట్టకు నిత్యం పశువులు, మేకలను మేపేందుకు వెళ్లేవారు పరమయ్యదాసు. వర్షం వస్తే తల దాచుకునేందుకు గుట్టను తొలిచి గుహలుగా మలిచాడు. అదే మోమిన్‌పేట మండలం వెల్చాల్ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. – మోమిన్‌పేట, మార్చి 12
పరమయ్యదాసు అనే పశువుల కాపరి తన పశువులను మేపేందుకు ప్రతిరోజూ దట్టమైన పులిలొంక అడవుల్లోని గుట్ట వద్దకు వెళ్లేవాడు. మేకల వద్ద తాను ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలిగేదని, దానికి తోడు ఎండా, వానలకు తల దాచుకోవడానికి ఒక ఆసరా కూడా లేకపోవడంతో ఆ కొండలను తొలిచి గుహ చేద్దామని గొడ్డలి చేత బట్టి రాత్రింబవళ్లు శ్రమించి, ఎవరి సాయం ఆశించకుండా నాలుగేండ్లలో గుట్టను గుహగా మలిచాడు.
ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రెండో యాదగిరి గుట్టగా కూడా పిలువడంతోపాటు గుహాలయం అద్భుతంగా ఉండటంతో అంజతా గుహలతో భక్తులు పోలుస్తుంటారు. కొండపై శ్రీలక్ష్మీనరసింహ స్వామితోపాటు ఆంజనేయ స్వామి, బద్రీనాథ, వేంకటేశ్వర, మల్లికార్జున, నాగేశ్వర స్వామి ఆలయాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. నాలుగు శుక్రవారాలు ఈ కొండకు వచ్చి దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు పరమయ్యదాసుకు ఒకరోజు కలలో కన్పించడంతో ఎలాగో కొండను తొలిచి గూడు ఏర్పాటు చేశావు.. నాక్కూడా గుడి కట్టు అని అన్నట్లు అనిపించిందంట. అప్పటి నుంచి రాత్రీపగలూ గుహను తొల్చడంలో నిమగ్నమయ్యాడు. ఎంత శ్రమించినా కష్టం అనిపించేది కాదట. ఇంటిని వదిలి పూర్తిగా అడవికే అంకితమయ్యాడు. ఆకలి, నిద్ర, పలలూ, రాత్రి అనక పట్టుదలతో గుహను చెక్కడంలో నిమగ్నమయ్యాడు. పరమయ్యదాసు చేసే పని నాలుగు సంవత్సరాల వరకు గ్రామంలో ఎవరికీ తెలియలేదు .ఆనోటా ఈనోటా పడి గ్రామస్తులందరికీ తెలియడంతో పరమయ్యదాసును కలిసి విషయం తెలుసుకున్నారు. నా కలలో లక్ష్మీనరసింహ స్వామి కనిపించి కొండ మీద స్థానం కల్పించమన్నాడని చెప్పడంతో 1965లో లక్ష్మీనరసింహ స్వామిని గ్రామస్తుల సహకారంతో ప్రతిష్ఠింపజేసి ప్రతి సంవత్సరం జాతర, స్వామి వారికి కల్యాణం వంటి
కార్యక్రమాలను చేపడుతున్నారు.
లక్ష్మీనరసింహస్వామి జాతర ఈనెల 13న ధ్వజారోహణం, పల్లకీ సేవ, భజన, సంకీర్తనలు, 14న రథోత్సవం, 15న శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు.
వికారాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్లే మార్గమధ్యంలో వెల్చాల్ గ్రామం మోమిన్‌పేట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీనరసింహస్వామి గుహాలయం ఉన్నది. వెల్చాల్ గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పులిలొంక కొండగుట్ట అదే శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం.