యాచారం, మార్చి 24: మండలంలోని తాటిపర్తి గ్రామంలో వారం రోజులుగా సంచరిస్తున్న చిరుత బుధవారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సెన్సర్ కెమెరాకు చిక్కిం ది. గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పొలంలో మేకను చంపి తిన్న పరిసరాల్లో అధికారులు బోనుతోపాటు కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. అయితే బోను వద్దకు వచ్చి న చిరుత అందులో చిక్కలేదు. కాగా గురువారం ఉదయం అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి..అక్కడికి మళ్లీ చిరుత వచ్చినట్లు దాని ఆనవాళ్లను గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్ కెమెరాను పరిశీలించగా చిరుత వచ్చినట్లు రికార్డు అయ్యిందని కందుకూరు రేంజ్ ఆఫీసర్ నిఖిల్‌రెడ్డి తెలిపారు. చిరుత ఇటీవల ఒకే ప్రాంతంలో వరుస దాడులకు పాల్పడుతుండటం అటవీశాఖ అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. దానిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితంలేదు. రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. హైదరాబాద్‌లోని జూ అధికారుల సహకారంతో వచ్చే నెలలో రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా స్పెషల్ షూటర్లను రంగంలోకి దింపి మత్తు మందు ద్వారా పట్టుకునేందుకు ప్రణాళికలను రూపొందిస్తామని నిఖిల్‌రెడ్డి తెలిపారు.