హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆత్మలకూ ఓట్లున్నాయి.. ఓటరు స్లిప్పులూ వెళ్తాయి.. కొన్నిచోట్ల అవే ఆత్మలు గుట్టుగా వచ్చి ఓటేసి వెళ్తాయేమో? ఇదేంది? ఆత్మలేమిటి? ఓటేమిటి? అనుకుంటున్నారా? నిజమే.. ప్రస్తుతం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార యంత్రాంగం రూపొందించిన ఓటరు జాబితాల్లో ఆత్మల పేర్లున్నాయి. అదేనండి.. చనిపోయిన వారి పేర్లు ఉన్నాయన్నమాట. ఒకటి, రెండు కాదు.. ఒక్కో మున్సిపాలిటీలో వందలు, వేలల్లో ఉన్నాయి. ఏడాది, రెండేండ్ల కాదు.. ఐదేండ్ల క్రితం చనిపోయిన వారికీ ఓట్లున్నాయి. అలసత్వంతో, పర్యవేక్షణాలోపంతో అస్తవ్యస్తంగా జాబితాలు రూపొందించిన అధికార యంత్రాంగం నిర్వాకమిది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల ఓటరు జాబితాలు తప్పులతో దర్శనమిస్తున్నాయి.
ఆయన చనిపోయి ఐదేండ్లయింది
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో 2,500 మంది మృతుల పేర్లు ఇంకా ఓటరు జాబితాల్లో ఉండటం షాక్‌కు గురి చేస్తున్నది. ఐదేండ్ల క్రితం చనిపోయిన నర్సింహ గౌడ్, మూడేండ్ల్ల క్రితం మరణించిన శ్రీశైలం వంటి వారు అధికారుల దృష్టిలో ఇప్పటికీ సజీవ ఓటర్లే. చేవెళ్ల, శంకర్పల్లి రెండు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 4,000 మంది చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాల్లో నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లోనూ కనిపిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక డివిజన్లలో కూడా చనిపోయిన వారి పేర్లను ఇంకా తొలగించకపోవడంతోపాటు, ఒకే ఇంటి నంబర్‌పై 50 నుంచి 100 ఓట్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్, నిజామాబాద్ నగరాల్లో చనిపోయిన వారితోపాటు వలస వెళ్లిన వారి పేర్లు కూడా భారీగా జాబితాల్లో కనిపిస్తున్నాయి. ఇటీవల ఏర్పడిన మున్సిపాలిటీల్లో వార్డుల విభజన నిబంధనల ప్రకారం జరుగకపోవడంతో ఒక వార్డులో ఉండాల్సిన ఓటరు పేరు మరో వార్డులో కనిపిస్తున్నది.
ఒక వ్యక్తి.. మూడు ఓట్లు!
ఓటరు జాబితాల్లో తప్పులు కేవలం మృతులతోనే ఆగిపోలేదు. ఒకే ఓటరుకు రెండు, మూడు చోట్ల ఓట్లు ఉండటం విస్మయానికి గురిచేస్తున్నది. సరైన పరిశీలన చేయకుండానే కొత్త ఓట్లను నమోదు చేయడం వల్ల లేదా పాత నివాసాల వద్ద ఓట్లను తొలగించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నది. ఆధార్ అనుసంధానం ప్రక్రియను పకడ్బందీగా చేపట్టకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తున్నది. దీనివల్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
కేటీఆర్ హెచ్చరికలు బేఖాతరు
ఓటరు జాబితాలోని ఇలాంటి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే ఆధారాలు సహా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆధారాలు సహా వివరాలను అందించారు. ‘ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే మృతుల పేర్లను తొలగించడం లేదు’ అని కేటీఆర్ ఆరోపించారు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి సర్వే చేయకుండానే, ఆఫీసుల్లో కూర్చొని జాబితాలు తయారు చేయడం వల్లే ఫొటో ఓటరు జాబితాలు తప్పుల తడకగా మారాయని విమర్శించారు. నిబంధనలు కఠినంగా ఉన్నాయని సాకులు చెప్పడం మానేసి, ఎన్నికల సంఘం తక్షణమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా మృతుల పేర్లు ఓటరు జాబితాల్లో ఉండటం వ్యవస్థకే అవమానకరం. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఓటరు జాబితాలను ప్రక్షాళన చేయకపోతే, అర్హులైన వారికే ఓటుహకు ఉండేలా చూడకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.