Jubli Nagar : కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలం అనే ఓ ప్రైవేట్ ఉద్యోగికి ముక్కుపచ్చరాలని తన ఇద్దరు ఆడ పిల్లలను పొట్టనబెట్టుకున్నాడు. కన్నబిడ్డల పాలిట రాక్షసుడలా మారిన అతడు.. కవల పిల్లలైన ఇద్దరిని బావిలో పడేసి హతమార్చాడు. భర్యతో నిత్యం గొడవల కారణంగానే శ్రీశైలం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
శ్రీశైలం భార్య కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చావు అంటూ అతడు భార్యతో తరుచూ గొడవ పడుతుండేవాడు. గ్రామంలోని పెద్దలు అనేక సార్లు సర్ధి చెప్పినా శ్రీశైలం తీరు మారలేదు. శుక్రవారం రోజు కూడా ఇదే విషయమై భార్యతో గొడవ పడిన శ్రీశైలం ఇద్దరు కూతుళ్లను తీసుకెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కోపంతో అతడికి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో వెతకగా ఒక పాప మృతదేహం లభించింది. మరో బాలిక మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో వెతికిస్తున్నారు. ఇద్దరు చిన్నారులను బావిలో పడేయడానికి ముందు శ్రీశైలం వారికి గడ్డి ముందు తాగించినట్లు అనుమానిస్తున్నారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.