సూర్యాపేట, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు ప్రవళికాప్రకాశ్, అన్నపూర్ణతో పాటు సీనియర్లు ఎంతో మంది ఈ సారి త్యాగం చేసి కొత్తవారికి అవకాశం కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సూర్యాపేటను మహానగరాలకు దీటుగా తీర్చిదిద్దితే .. ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. సమన్వయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అరాచక కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 48 వార్డుల్లో విజయం బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సీపీఎం, సీపీఐ బీఆర్ఎస్కు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.