మానవపాడు, ఫిబ్రవరి 3 : ఆరుగాలం కష్టపడి పండించిన మిరపకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో ఏసీ గోదాంలో నిల్వ ఉంచిన మిరపను రైతులకు సమాచారం లేకుండా నిర్వాహకులు విక్రయించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన రైతులు రమేశ్, రాముడు, బజారి, నాగశేషి, సాయిబాబా తాము పండించిన మిరప పంటకు ధరలేకపోవడంతో 2024లో 1,040 బస్తాలను ఏపీలోని గుంటూరు లీలాగాయత్రి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వచేశారు. ఈ నెలలో ధర పెరగడంతో అమ్ముకుందామని భావించి కోల్డ్ స్టోరేజీకి వెళ్లారు.
తమ మిరప బస్తాలు ఇవ్వాలని నిర్వాహకులను కోరగా.. వాటిని విక్రయించామని చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. ‘తమ బస్తాలను మీరు ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తే.. మీ మిరప లేదని, మీ ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకోండి’ అటూ బెదిరించారని వాపోయారు. తమ మిరపబస్తాలు అన్నా ఇవ్వాలని.. లేదా ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని నాలుగురోజులుగా కోల్డ్ స్టోరేజ్ వద్దనే పడిగాపులు కాస్తున్నట్టు పేర్కొన్నారు.