దేశంలో బ్రిటిష్ వారి రాజ్యాంగం రంగప్రవేశం చేయడంతో నిమ్న అణగదొక్కబడిన జాతులకు… శారీరక బానిసత్వం నుంచి విముక్తి కలిగింది కానీ, ఈ జన సామాన్యానికి విద్య నేర్పించే ముఖ్యమైన ప్రయత్నాన్ని ఈ ఉదార బ్రిటిష్ ప్రభుత్వం చెయ్యటానికి నడుంకట్టలేదని చెప్పవలసివచ్చినందుకు విచారిస్తున్నాం. ఇందుచేతనే శూద్రులు ఇంకా మూఢులుగా ఉంటున్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయాల నివారణ కోసం ప్రభుత్వానికి మొరపెట్టుకోలేకపోతున్నారు. ఒక వర్గం, జనసామాన్యాన్నీ వాళ్ల దైనందిన సమస్యల పరిష్కారంలోనూ, పరిపాలనా యంత్రాంగంలోనూ ఉండి, ఎలా దోపిడీ చేస్తున్నారో ప్రభుత్వం ఇంకా తెలుసుకోలేదు.(పూలే రచన గులాంగిరీ ముందుమాట నుంచి)
బహుజన బిడ్డలు చదువుల కోసం పోతే విషాహారం కాటుకు బలికావటం లాంటి వార్తలు వినవలసిరావటం అత్యంత దారుణం. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకునే క్రమంలో బహుజన బిడ్డలు చదువులకు పోయి బొందల గడ్డల పాలవుతుంటే ఈ నేరం ప్రభుత్వానిదేనని ప్రభుత్వానికి సవినయంగా విన్నవిస్తున్నాం. మా చెమ్మగిల్లిన కండ్లతోనే హంతక ప్రభుత్వమని మా గుండెల నిండా బాధతో అంటున్నాం. ఇందుకోసమా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. పాలనారంగం విఫలమైనందున న్యాయవ్యవస్థ అయినా బహుజన బిడ్డల చావులను ఆపేందుకు బాధ్యత తీసుకొని ఉత్తర్వులు జారీ చేయాలని వేడుకుంటున్నాం. ఇది బిడ్డల్ని కోల్పోయిన బహుజన తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆవేదనను చెప్పేందుకు చేసే ప్రయత్నమే కానీ వేరే ఉద్దేశం మాత్రం కాదు. వందమందికి పైగా గురుకుల విద్యాలయ విద్యార్థుల మరణాలు జరిగాక.. ఇది హంతక ప్రభుత్వమని నిర్ధారణకు వచ్చాకే అక్షరీకరించవలసి వచ్చింది. మరో బహుజన బిడ్డ విషాహారం కాటుకు గురికాకుండా విద్యారంగ పరిరక్షకులందరూ చూడాలి.
దేశానికి స్వాతంత్య్రం రాకముందే బహుజనుల దీనగాథను చెప్తూ కింది వర్గాల స్వాతంత్య్రాన్ని మహత్మా జ్యోతిబాఫూలే నిగ్గదీసి అడిగారు. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత మా బహుజన బిడ్డల చావులకు అంతం ఎప్పుడు అని తెలంగాణ చట్ట సభను అడగవలసి రావటం పరమ విచారకరం. గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదివే మా బిడ్డలు ఇక విషాహారం కాటుకు గురి కాకుండా చూస్తామని చెప్పటమే కాదు, అందుకు ఆచరణను చూపి, ప్రభుత్వం తన మానవీయతను నిరూపించుకోవాలి. తన బిడ్డలను తానే చంపుకొనే పాము లాంటి తెలంగాణను మేము కోరుకున్నామా?
దయా దాక్షిణ్యం లేని హంతక ప్రభుత్వాన్ని కోరుకున్నామా? రాజ్యమా ఒక్క సారి లోలోపల చూసుకుని జవాబు చెప్పు, బహుజన బిడ్డలు పురుగుల అన్నం తిని అస్తమిస్తుంటే, ఆకలి కడుపులకు అన్నం పెట్టలేని ప్రభుత్వం బహుజనుల వెన్నులు విరిచి తెలంగాణ రైజింగ్ పేరుతో పెట్టుబడులను రా రమ్మని పిలుస్తున్నది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెడుతుంటే సంబురాలు ఎవరు చేసుకుంటున్నరు? బీసీ బిడ్డల కంచాల్లో మాత్రం మాకు పురుగుల అన్నమే కనిపిస్తున్నది. మా బువ్వలో మట్టి పోసి పురుగులు వేసి ఎవరు బంగారు పళ్లాల్లో ఆరగిస్తున్నారో బహుజనులు గమనిస్తున్నారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో వంద మందికిపైగా గురుకుల పిల్లలు, సుమారు 400 మంది రైతులు, నిరాశానిస్పృహతో వందల సంఖ్యలో పలు కుటుంబాల ఆత్మహత్యలు జరగటం మనసును పిండేస్తున్నది. బహుజన బిడ్డల మరణాలపై తెలంగాణ సూర్యోదయాలను వెలిగిస్తారా? రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయటం లేదు.
రెండేండ్లు ఓపికపట్టి చూసినం. 120 మంది పిల్లలు పిట్టల్లా రాలిపోయినాక ఆగ్రహంతో రాయాల్సివస్తున్నది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కి, బీసీలను ఘోరంగా మోసగించిన తీరు, మీ ప్రభుత్వాన్ని ఉత్తగనే వదలదు. బహుజనుల జీవన వ్యవస్థలపై సమ్మెట పోట్లు వేసి, పాలకులు చేసే గ్లోబల్ సమ్మిట్లను చూసి పరవశించి పొమ్మంటున్నారా? మా చావుల మీద పెట్టుబడుల సమ్మిట్లు పెట్టి ఇంకా ఎంతకాలం బుకాయించి చంపుతారు? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వాగ్దానాన్ని ఇచ్చి, బీసీలను మోసగించి గెలిచి గద్దెనెక్కి గురుకులాలలో చదివే 120 మంది బహుజన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు.
బిడ్డల్ని ఎన్నో ఆశలతో గురుకులాలకు పంపితే కలుషిత ఆహారం పెట్టి ప్రాణాలు తీస్తారా? గురుకులాల నుంచి దేశ మానవ వనరుల్ని అభివృద్ధి చేసే యోధులుగా ఆ బిడ్డలు ఎదుగుతారని తెలంగాణ సమాజమే ఎదురు చూస్తున్నది. మా బిడ్డలు పాములూ, తేళ్లు కరిచి చచ్చిపోతున్నారు. కలుషిత ఆహారం తిని కన్నుమూస్తున్నారు. కలుషిత నీళ్లు తాగి మంచాన పడుతున్నారు. మా బిడ్డలకు హాస్టళ్లలో శుభ్రమైన అన్నం పెట్టలేని ప్రభుత్వాన్ని ఏమి అనాలో పౌరసమాజాలే చెప్పాలి. మా బిడ్డలకు మరుగుదొడ్ల వసతులుండవా? చలిలో వణకాలా? ఎండలకు ఎండాలా? వర్షాలకు తడవాలా? ఏమి గోస అయ్యా ఇది? ఏమి బతుకులు అయ్యా ఇవి అని బహుజన పిల్లల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. మీరిచ్చిన బహుజన డిక్లరేషన్లు మా బిడ్డలకు మరణ శాసనాలు రాశాయి. ఇవన్నీ చూస్తుంటే మా గుండెలు ద్రవిస్తున్నాయి.
బహుజన బిడ్డల బతుకులపై యథేచ్ఛగా మరణశాసనాలు రాసే అధికారం మీకు ఎవరిచ్చారో చెప్పాలి. ప్రతి బహుజన బిడ్డా గొంతెత్తి నినదించక తప్పదు. మనల్ని దిక్కులేని వాళ్లను చేసి మన తలెత్తి నిలువకుండా వాగ్దానాల్లో ముంచి మమ్మల్ని ఇంకెంత కాలం ఇట్లనే చంపుతారని ప్రతి తల్లి, తండ్రి అడుగుతున్నారు. మా బహుజన తల్లులను కోటీశ్వరులను చేస్తమని చెప్పుకొంటూ మా పిల్లల ప్రాణాలు తీస్తారా? అనే మాటలు గద్దె మీదనున్న పాలకులకు వినిపించడం లేదా? రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలన్నింటికీ శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలి.
అన్ని రకాల వసతులను ఏర్పరచాలి. నాణ్యమైన ఆహారం ఇవ్వాలి. నాణ్యమైన చదువును అందించాలి. మా బిడ్దల్ని కాటికి పంపించి మీరు నిర్మించబోయే స్వర్గధామాలు ఎవరి కోసం? తెలంగాణ నివురుగప్పిన నిప్పును గుర్తుపెట్టుకోండి. మహాత్మా జ్యోతిబాపూలే, అంబేద్కర్ ఆదర్శాలతో నిర్మించిన గురుకులాల రక్షణ కోసం బలమైన బహుజన ఉద్యమాలు నిర్మితం కావాలి. తెలంగాణ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమాహారం. 90 శాతంగా ఉన్న మా బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. బహుజనుల బతుకుల బాగు కోసం ఉద్యమాలు నిర్మితం చేయాలి.
– తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్