చాలా రోజులదాకా నాకు ‘కం సెప్టెంబర్ మ్యూజిక్’ అనేదొకటుందని తెలియదు. రేడియోలో హైదరాబాద్ కేంద్రంలోనే ప్రధాన విభాగంతోపాటు వివిధ భారతి, యువవాణి అనే వేర్వేరు విభాగాలుండేవి. అందులో యువవాణిలో ఇంగ్లిష్ పాటలు వస్తుండేవి. దాంట్లో ఈ కం సెప్టెంబర్ మ్యూజిక్ వచ్చేది. దాన్ని రంగస్థలం మీద డైలాగ్స్ లేని మూకీ స్కిట్స్‌కి నేపథ్యంగా వాడేవారు.
యువవాణి లోనే ‘డ్రీమ్ ల్యాండ్’ అనే ఇంగ్లిష్ పాట కూడా చాలాసార్లు వినిపిస్తుండేది. అది చాలా శ్రావ్యంగా ఉండేది. మళ్లీ ఎంత వెదికినా ఆ పాట దొరకలేదు. ఇంతకూ ఈ కం సెప్టెంబర్ మాటను మా బడిలో ఇంకోలా వాడేవారు. బాగా చదవని టెంత్ క్లాస్ మగపిల్లల్ని సార్లు ‘ఏందిరా, కం సెప్టెంబర్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నవా?’ అనడిగేవారు. అంటే మార్చిలో రాసే పరీక్షల్లో ఫెయిల్ అయి మళ్లీ సెప్టెంబర్‌లో రాయడం అన్నమాట. అబ్బాయిలు అప్పుడు చాలా సిగ్గుపడిపోతూ… ముఖ్యంగా అమ్మాయిల ముందు ‘ఎహె, ఏం గాదు సార్! మంచిగనే సదువుతున్న’ అనేవాళ్లు. మరి ‘గీ మార్కులకే మురుస్తాన్నవారా! ఎట్ల పాసయితననుకుంటానవురా?’ అని వెక్కిరించేవారు.
నేను కూడా కం సెప్టెంబర్ మ్యూజిక్ పాడతానని ఎప్పుడూ అనుకోలేదు. మా కాలేజీలో క్లర్క్ సుమిత్రా మేడమ్ పుణ్యమా అని నాకు హాల్ టికెట్ రాకపోవడం, మార్చిలో పరీక్షలు రాయలేకపోవడం వల్ల నా ఆశలన్నీ తలకిందులయ్యాయి. అప్పట్లో ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ పద్ధతి లేదు. అయితే నిద్రలో లేపి అడిగినా జవాబు చెప్పేట్టుగా చదివే నాకు ఆర్నెల్ల గ్యాప్ చాలా భయం కలిగించింది. ఎలాగయినా పరీక్షలు రాసి నన్ను నేను నిరూపించుకోవాలనిపించేది.
థియరీ ఎలాగైనా చదువుకుంటాను గానీ, ప్రాక్టికల్స్ ఎలా? అన్నీ కాకపోయినా కొంచెం కష్టమయినవి మళ్లీ చూసుకుంటే బావుండునని నా కోరిక. ఏం చేయను? బాగా ఆలోచించగా సత్యనారాయణరావు బావగారు గుర్తొచ్చారు. ఆయన మా పెద్ద చిన్నాయన అల్లుడు, మా కజిన్ లక్ష్మక్క భర్త. ఆయన హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో లెక్చరర్‌గా ఉన్నారు. అప్పటికింకా కాకతీయ యూనివర్సిటీ ఏర్పడలేదు. ఈ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగానే ఉండేది. ఆయన నాకేదైనా సాయం చేయగలడనిపించింది.
లచ్చక్క, బావల పెళ్లికి నేను మూడు నెలల పిల్లనట. అక్క ప్రేమ ఎటూ ఉంటుంది గానీ, ఆయన కూడా నా మీద పితృవాత్సల్యం చూపించేవాడు. నేను బాగా చదువుకుంటానని ఆయన మెచ్చుకునేవాడు. పైగా మా అక్క ఇంటర్ కోసం వాళ్లింట్లోనే ఉంది. వాళ్ల తమ్ముడికే అక్కతో పెళ్లి నిశ్చయమైంది కూడా. నేను నాన్నను అడగ్గానే నాన్న సత్యనారాయణరావు బావకు ఒక ఉత్తరం రాశారు. ఆయన వెంటనే నన్ను వాళ్లింటికి పంపమని బదులిచ్చారు.
నేను పరీక్షల ముందు ఓ వారం రోజులపాటు హన్మకొండకు వెళ్లి వాళ్లింట్లో ఉన్నాను. సత్యనారాయణరావు బావ నన్ను తను పనిచేసే ఆర్ట్స్ కాలేజీకి తీసుకెళ్లి సైన్స్ గ్రూప్‌లో ప్రతి డిపార్టమెంట్ లెక్చరర్స్ అందరికీ పరిచయం చేశారు. ‘మా చిన్న మరదలు, చాలా ఇంటెలిజెంట్. సెప్టెంబర్‌లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మన దగ్గర రివిజన్ చేసుకుంటుంది. కాస్త కో అపరేట్ చేయండి, అవసరమైతే గైడ్ చేయండి’ అని చెప్పారు. దాదాపు అందరూ ‘ఓ ఎస్!’ అన్నారు. ఒకళ్లిద్దరు మాత్రం ‘అదేంది సార్! ఇంటెలిజెంట్ అంటున్నారు, మార్చిలో పాస్ కాలేదా?’ అనడిగేవారు. నాకు అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కాదు. చెప్పిన పాత పురాణమే ఎన్ని సార్లు చెబుతాను? అప్పుడు నా పాలిటి ఆపద్బాంధవుడిలా బావ కలుగజేసుకుని ‘తన తప్పేమీ లేదు, కొన్ని అనుకోని అనివార్య పరిస్థితుల్లో, గ్రహాలు అనుకూలించక, విధి వక్రించి తను మార్చిలో పరీక్షలు రాయలేకపోయింది, ఇప్పుడు రాస్తుంది. సరేనా!’ అనేవారు తన ధోరణిలో. ఆయన ఏం మాట్లాడినా అలా హాస్యంగానే మాట్లాడేవారు.
‘అయ్యో! అట్ల అంటులేం సార్! ఉత్తగనే అడిగినం’ అనేవారు వాళ్లు. మొత్తానికి ఆ లెక్చరర్స్ నాకెంతో హెల్ప్ చేసారు. వాళ్ల వెంట తీసుకెళ్లి కొన్ని ప్రయోగాలు స్వయంగా చేసి చూపించడం, మరికొన్ని డెమాన్స్ట్రేటర్స్తో చెప్పించడం చేశారు. ఆ వారం రోజులు నేనెంతో స్వేచ్ఛగా చదువు నేర్చుకున్నాను. ఎట్టకేలకు ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చాయి. నేను మళ్లీ హైదరాబాదుకు వెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షలు రాశాను. మొత్తానికి రెండు నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను. అలా సమ్మర్లో కాకుండా వింటర్లో ఇంటర్ పూర్తయినందుకు నేను ఒక విద్యా సంవత్సరం కోల్పోయాను. అయినా సరే చదువుకు సంబంధించి నా తప్పేమీ లేదని రుజువు చేసుకున్నందుకు సంతోషపడ్డాను. ముఖ్యంగా అమ్మ నాతో మామూలుగా ఉండటం మొదలుపెట్టింది. మళ్లీ వచ్చే ఎండాకాలం రెగ్యులర్ వాళ్లతో కలిసి ఎంసెట్ రాసి మెడిసిన్‌లో సీటు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరడం మొదలుపెట్టాను.
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి