తన పేరు చాలు… థియేటర్ నిండిపోతుంది! చెప్పేది హీరో గురించి కాదు దర్శకుడి గురించి అంటే నమ్ముతారా? ఒకప్పుడు సినిమా విజయం హీరో మీద ఆధారపడేది. తర్వాత కథకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ప్రపంచ సినీ పరిశ్రమలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తున్నది. కొందరు దర్శకుల పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు… ప్రేక్షకులు హీరోతో సంబంధం లేకుండా టికెట్ బుక్ చేసేస్తున్నారు. అలాంటి అతికొద్ది మంది దర్శకుల్లో ముందుగా వినిపించే పేరే సర్ క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్.. అందరికీ సుపరిచితమైన పేరు ‘క్రిస్టోఫర్ నోలన్’. తన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం
ప్రీమియర్ షో కోసం ఆయన ముంబయికి రావడం, ఇక్కడి ప్రేక్షకులను ప్రత్యేకంగా ప్రశంసించడం మరోసారి ఆయన్ను వార్తల్లో నిలిపింది. కానీ… ఒక దర్శకుడి పేరు సినిమాకు బ్రాండ్‌గా ఎలా మారింది?
హాలీవుడ్లో స్టార్ హీరోలకు కొరత లేదు. అయినా నోలన్ సినిమా అనగానే ముందుగా చర్చ మొదలయ్యేది హీరో ఎవరబ్బా అని కాదు… అతనేం తీస్తాడని. హీరోలను మించి దర్శకుడి పేరు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం సాధారణ విషయం కాదు. ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, ఓపెన్‌హైమర్… ఇలా సినిమా ఏదైనా ప్రేక్షకులు ముందుగా అడిగేది ఒకటే. ‘ఈసారి నోలన్ కొత్తగా ఏం చూపించబోతున్నాడు?’.. ఇదే ఆయన సంపాదించుకున్న అతిపెద్ద గుర్తింపు.
చాలా సినిమాలు రొటీన్‌గా మొదలై అంతే రొటీన్‌గా ముగుస్తుంటాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్ ఆ క్రమాన్నే మార్చేశాడు. ముగింపును ముందే చూపించడం, గతం-ప్రస్తుతం-భవిష్యత్తును ఒకేసారి కథలో కలపడం, ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా మలుపులు సృష్టించడం… ఇదే ఆయన ప్రత్యేకత. ఈ కథన శైలినే ‘నాన్-లీనియర్ స్టోరీటెల్లింగ్’ అంటారు. మెమెంటో, ది ప్రెస్టీజ్, ఇన్సెప్షన్, టెనెట్ లాంటి చిత్రాలతో ఈ ైస్టెల్‌ని ప్రపంచవ్యాప్తంగా తన గుర్తింపుగా మార్చుకున్నాడు నోలన్. అందుకే ప్రపంచ సినీ అభిమానులు ఆయన్ని ప్రేమగా ‘Non-Linear Nolan’ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాలు కేవలం చూసి మర్చిపోయేవి కావు… పూర్తయ్యాక ఆలోచించే అవకాశం ఇస్తాడు. అందుకే ఆయన సినిమాలు ఒకసారి చూసి పూర్తిగా అర్థం కావని చాలామంది మళ్లీ మళ్లీ చూస్తుంటారు.

భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఏదైనా సృష్టించవచ్చు. కానీ, నోలన్ ఇప్పటికీ వీలైనంత వరకు నిజమైన లొకేషన్లు, భారీ సెట్లు, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ పైనే ఎక్కువగా ఆధారపడతాడు. ప్రేక్షకుడు తెరపై చూసేది నిజంగానే జరిగితే ఆ అనుభూతి వేరుగా ఉంటుందని ఆయన నమ్మకం.‘ది ఒడిస్సీ’ కోసం కూడా అనేక దేశాల్లో షూటింగ్ చేశాడు. పూర్తి స్థాయిలో ఐమ్యాక్స్ కెమెరాలతో తెరకెక్కించి క్రాఫ్ట్‌పై ఆయనకున్న గౌరవం, మక్కువను మరోసారి నిరూపించాడు.
భారత్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నోలన్ చెప్పిన మాట ఆయన ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుంది. ‘సినిమా నేను పూర్తి చేసినప్పుడు పూర్తి అవ్వదు. ప్రేక్షకులు చూసి, దాని గురించి మాట్లాడిన తర్వాతే అది పూర్తవుతుంది’ అన్నాడు. అందుకే ఆయన సినిమాల గురించి విడుదలైన పదేళ్ల తర్వాత కూడా చర్చలు కొనసాగుతుంటాయి. ప్రేక్షకుడికి కథలో తనదైన అర్థాన్ని వెతుక్కునేలా చేస్తాయి.
‘ది ఒడిస్సీ’ ప్రీమియర్‌కు భారత్‌ను ఎంచుకోవడం కూడా ప్రత్యేకమే. ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రేక్షకులను ప్రపంచంలోనే సినిమాను అత్యంత ఎక్కువ ప్రేమించేవారని, సినిమాను లోతుగా అర్థం చేసుకునేవారని అన్నారు. చాలాకాలంగా తన సినిమాను భారత్‌లో ప్రీమియర్ చేయాలనేది కోరిక అని కూడా చెప్పారు. ఈ మాటలు భారత సినీ అభిమానుల్లో మరింత అభిమానాన్ని పెంచాయి.