కడ్తాల్, మార్చి 24 : నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులు రూ.8 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, తండాలకు అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. సమగ్ర గిరిజనాభివృద్ధిలో భాగంగా నియోజకవర్గంలోని 212 తండాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ను బడ్జెట్ సమావేశాల్లో కోరినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు రహదారిని నాలుగు లైన్లుగా మార్చడంతో పాటు ఆర్ఆర్ఆర్కు వేసవి కాలంలో సర్వే నిర్వహించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే లింక్ రోడ్లన్నింటినీ బీటీ రోడ్లుగా మారుస్తామని, కడ్తాల్ నుంచి చల్లంపల్లి వయా పడకల్ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో తొలి విడుతలో 3 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడుతామన్నారు. కొత్తగా ఏర్పడిన కడ్తాల్, చారగొండ మండల కేంద్రాల్లో అన్ని శాఖల కార్యాలయాల భవనాలను నిర్మిస్తామన్నారు. అంతకుముందు కడ్తాల్ గ్రామంలో యాదవ సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రావిచేడ్ గ్రామానికి చెందిన రామస్వామికి రూ. 26 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విమర్శించారు. ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినా ఇప్పటి వరకు ఎలాంటి లేఖలు రాలేదన్నారు. తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర మంత్రి బిశ్వేశ్వరన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృస్థాయి సమావేశాన్ని శుక్రవారం కల్వకుర్తిలోని సీకేఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరవ్వాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, చందోజీ, నరేందర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, భిక్షపతి, రాంచంద్రయ్య, గంప శ్రీను, గణేశ్‌గౌడ్, మహేశ్, వీరయ్య, నర్సింహ, లాయక్‌అలీ, రమేశ్, వెంకటేశ్, నాగార్జున్, హర్యానాయక్, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో తేజ్‌సింగ్, పీఆర్ ఏఈ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు, మార్చి 24 : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఆపదవస్తే అక్కున చేర్చుకుంటామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. గురువారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి 9వ వార్డులో బ్యాటరీ బాబా కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు బీమా చేయించినట్లు తెలిపారు. బాధితుడు బాబా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, కౌన్సిలర్ సోనాజయరాం పాల్గొన్నారు.