ఇబ్రహీంపట్నం, మార్చి 12 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఎంకేఆర్ ఫౌండేషన్ కొండంత అండగా నిలుస్తున్నది. ఆర్థిక స్థోమతలేక కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికోసం ఎంకేఆర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలను పెంచుకునేందుకు దోహదపడుతుంది. ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రెండు విడుతల్లో 814 మంది పోలీసు, ఇతర ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకున్నారు. ఇందులో 386 మంది పోలీసు ఉద్యోగాలతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం మూడో విడుతలో 704 మంది ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుని శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో నాలుగో విడుత ఉచిత శిక్షణ కోసం ఎంకేఆర్ ఫౌండేషన్ సిద్ధమవుతున్నది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు స్టడీమెటీరియల్స్ కూడా అందుబాటులో ఉండటం వల్ల నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. నాలుగో విడుతలో కూడా నిరుద్యోగ యువత కోసం ఎక్కడికక్కడ స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేసి వారికి అవసరమైన మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రాష్ట్రంలో 80 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు సాధించడానికి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ కేంద్రాల్లో చేరేవారు ఆదివారం నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవటానికి అవకాశం కల్పించారు. గ్రూప్-1, గ్రూప్-2, పోలీసు, ఉపాధ్యాయుల పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలకు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని నిరుద్యోగ యువత కోసం ఆయా మండల పరిధిలోని దరఖాస్తు చేసుకున్న వారందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాలను స్టడీ సర్కిళ్ల కోసం ఏర్పాటు చేశారు. గ్రూప్-1, గ్రూప్-2లకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఒక స్టడిసెంటర్ను, పోలీసు ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మరో రెండు స్టడీ సర్కిళ్లను, ఇతర ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులను బట్టి మరో స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టడీ సెంటర్‌కు వచ్చేవారికి ఉచితంగా భోజన వసతి కూడా కల్పించనున్నారు.
యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన శిక్షణలో పెద్ద ఎత్తున యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారు. నాలుగో విడుతలో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించేందుకు యువత ముందుకు రావాలి. ఆదివారం నుంచి నాలుగో విడుత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం