పెద్దేముల్, మార్చి 11: ఆత్కూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో దానిని పట్టుకునేందుకు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు ఓ బోనును శుక్రవారం ఆత్కూర్ అటవీ ప్రాంతంలోని పంట పొలాల మధ్య సిబ్బందితో ఏర్పాటు చేయించారు. మండల పరిధిలోని జిన్గుర్తి రిజర్వు ఫారెస్ట్ ఇందూరు ఫారెస్ట్ సెక్షన్ పరిసర ప్రాంతమైన ఆత్కూర్ గ్రామ సమీపంలోని పరిసరాల్లో ఓ చిరుత పులి సంచరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్యాంసుందర్రావు మాట్లాడుతూ చిరుత పులిని పట్టుకునేందుకు హైదరాబాద్లోని జూపార్కు నుంచి ఓ ప్రత్యేకమైన బోనును తీసుకొచ్చి ఆత్కూర్ ప్రాంత పంటపొలాల్లో గ్రామస్తుల సమక్షంలో ఏర్పాటు చేయించారు. స్థానికులు, పశువుల కాపరులు చిరుత పులి బోనులో చిక్కే వరకు అటువైపు వెళ్లొద్దన్నారు. ఆయన వెంట ఆత్కూర్ సర్పంచ్ సువర్ణ, ఇందూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మమత, గ్రామస్తులు, అధికారులు ఉన్నారు.