రక్షణ సేవలు, కేసుల పరిష్కారం, స్టేషన్ నిర్వహణ తదితర అంశాల్లో మన జిల్లా పోలీసులు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. 2021 సంవత్సరానికి సంబంధించి పనితీరు ఆధారంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తమ పోలీస్స్టేషన్లను ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల్లో ప్రతినెలా వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయగా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఐదు పోలీస్స్టేషన్లు ఉత్తమంగా నిలిచాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, వికారాబాద్ జిల్లాలోని ధారూర్, తాండూరుటౌన్, బషీరాబాద్, మోమిన్‌పేట పీఎస్‌లు ఉన్నాయి. కేసుల నమోదు, రిపోర్టింగ్, పరిష్కారం, నిందితుల అరెస్టు, రిసెప్షన్, బీట్లు, పెట్రోలింగ్ తదితర అంశాల ప్రాతిపదికగా ఎంపిక చేశారు. 200 కేసుల లోపు కేటగిరిలో ధారూర్ పోలీస్ స్టేషన్ 75.17 మార్కులతో వికారాబాద్ జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా బషీరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే 201 పైగా కేసుల కేటగిరీలో తాండూరు టౌన్ స్టేషన్ 75.88 మార్కులతో అగ్రస్థానం దక్కించుకోగా మోమిన్‌పేట్ రెండో స్థానం దక్కించుకున్నది. అలాగే మూడు కమిషనరేట్ల పరిధుల్లో కొత్తూరు పీఎస్ అగ్రభాగాన నిలిచింది.
2021 సంవత్సరంలో పనితీరు ఆధారంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. అలాగే వికారాబాద్ జిల్లాలో 200 కేసుల లోపు కేటగిరీలో ధారూరు 75.17 మార్కులతో జిల్లాలో మొదటి స్థానంలో, బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. 201 పైగా కేసుల కేటగిరీలో తాండూరు టౌన్ 75.88 మార్కులతో మొదటి స్థానంలో, మోమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది ఈ మేరకు 2021 సంవత్సరానికి జిల్లాలవారీగా ఉత్తమ పోలీస్స్టేషన్లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందించిన 19 అంశాల్లో 100 పాయింట్లలో ఉత్తమ మార్కులు సాధించి ప్రజలకు మెరుగైన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వన్ ఆఫ్‌ది బెస్ట్‌గా అగ్రభాగాన నిలిచాయి. కేసుల పరిశోధన, ఛేదన, బ్లూకోర్స్, పెట్రోకార్, త్వరితగతిన కేసుల నమోదు, కేసుల పరిష్కారం, నిందితుల అరెస్టు, పీడీ యాక్ట్, లోక్ అదాలత్ కేసులు, పచ్చదనం, పరిశుభ్రత, రిసెప్షన్ నిర్వహణ, బీట్లు, పెట్రోలింగ్, ఇతర అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఉత్తమ పోలీస్స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఈ ఠాణాల పోలీసు అధికారులను వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.
– శ్రీధర్ భూపాల్, సీఐ, కొత్తూరు
రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్‌స్టేషన్‌గా నిలువడం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలోనే బెస్ట్‌గా నిలిపేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా సాయం కోసం మా వద్దకు వచ్చే ప్రజలకు త్వరితగతిన అందేలా చూస్తున్నాం. అందుకోసం అహర్నిశలు కృషి చేస్తున్న మా పోలీస్‌స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరి కృషి వల్లే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నాం.