వికారాబాద్, మార్చి 12 : గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రాఘవన్నాయక్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో ఈనెల 18, 19, 20వ తేదీల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలో 33 జిల్లాల నుంచి 66 జట్లు, సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. జూనియర్ బాల, బాలికలు, పురుషులు మహిళలు కబడ్డీ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శనను చూపాలన్నారు. గ్రామీణ స్థాయి బాల, బాలికలు ప్రతిభను చూపి, ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నారు. పూర్వం నుంచి కబడ్డీ ఆటలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జిల్లా, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవన్నాయక్ మాట్లాడుతూ..పోటీ ప్రపంచంలో చదువుతోపాటు క్రీడల్లోనూ సత్తా చాటాలన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా కబడ్డీ ఆటను ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి రాజా ప్రభాకర్, వికారాబాద్ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రవి నాయక్, విజయ నాయక్, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.