ఇబ్రహీంపట్నం, మార్చి 11 : మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ తాండ్ర విశాల, జిల్లా వెల్ఫేర్ అధికారి మోతీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం కేటాయించి ప్రేమతో మెలగాలన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. అన్ని రంగాల్లోనూ రాణించేందుకు మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ తాండ్ర విశాల, వెల్ఫేర్ అధికారి మోతీ మాట్లాడుతూ..అంగన్వాడీల్లో పనిచేస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకు వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్‌జడ్జి ఇందిర, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కేశంపేట జడ్పీటీసీ విశాల, ఐసీడీఎస్ అధికారులు శాంతిశ్రీ, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో క్రాంతికిరణ్, ఏఈ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మాధవి, ఐసీడీఎస్ సీడీపీవో శాంతిశ్రీ, సూపర్ వైజర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 11 : మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని సర్పంచ్ అశోక్‌వర్ధన్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని ఎలిమినేడులో శుక్రవారం వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 50 మంది మహిళలను సన్మానించారు. స్త్రీ లేకుండా ఈ సమాజం లేదన్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు, ఉత్తమ మహిళలు, ఉత్తమ విద్యార్థినులను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మార్త, వార్డు సభ్యులు బుట్టి మహేశ్, రాంరెడ్డి, యాదయ్య, చెన్నయ్య, లక్ష్మమ్మ, సంతోష, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దోమకొండ నర్సింహ పాల్గొన్నారు.
కొందుర్గు : మహిళలు కుటుంబ బాధ్యతతో పాటు సమాజ బాధ్యత కూడా తీసుకుని ముందుకు సాగాలని ఎంపీడీవో ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాగమ్మ, వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఎదిర రామకృష్ణ, రాంచంద్రయ్య, నర్సింహులు తదితరులు ఉన్నారు.
చేవెళ్లటౌన్ : మహిళలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ బండారి శైలజ అన్నారు. మండల పరిషత్ కార్యాలంలో సీడీపీవో శోభారాణి ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీలను సన్మానించి, స్వీట్లు పంపిణీ చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలను లింగ వివక్ష చూపకుండా సమానంగా చూడాలన్నారు. కార్యక్రమంలో సూపర్ వైజర్లు నిర్మల, కళావతి, వాణి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.