పరిగి, మార్చి 4 : పాఠకులకు మరింత ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త భవనాల నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో రూ.4.34కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భవనాలను రెండేండ్లలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నది. వీటికి తోడుగా వికారాబాద్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లోనూ శాఖా గ్రంథాలయాలు నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. జిల్లా పరిధిలో మొత్తం 18 గ్రంథాలయాలు ఉండగా నిత్యం సుమారు 1800 నుంచి 2వేల మంది పాఠకులు వస్తుంటారు. కాగా, దినపత్రికలు మొదలుకొని పోటీ పరీక్షల వరకు అనేక పుస్తకాలు అందుబాటులో ఉండడంతో పాఠకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.
వికారాబాద్‌లో గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తికాగా..త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రూ.1.50కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా పాత గ్రంథాలయ భవనంపై ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. ఇందులో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కూర్చొని చదువుకునేందుకు వీలుగా కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేపట్టనున్నారు. అలాగే గ్రంథాలయ కొత్త భవనంలో కంప్యూటర్ సెక్షన్ సైతం ఏర్పాటు చేసి పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. గ్రంథాలయ భవనం చుట్టూ పచ్చని చెట్లు పెంచడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది.
జిల్లాలో నాలుగుచోట్ల కొత్త భవనాల నిర్మాణానికి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ సంకల్పించింది. కొడంగల్‌లో రూ.78లక్షలు, దౌల్తాబాద్‌లో రూ.38లక్షలు, బొంరాస్‌పేట్‌లో రూ.38లక్షలు, తాండూరులో రూ.1.30కోట్ల వ్యయంతో గ్రంథాలయ భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నది. తాండూరులో 1954లో నిర్మించిన భవనంలోనే గ్రంథాలయం కొనసాగుతుండగా.. కొత్త భవనం అందుబాటులోకి వస్తే పాఠకులకు మేలు జరుగనున్నది.
జిల్లా పరిధిలో నూతనంగా ఏర్పడిన మండలాలు చౌడాపూర్, కోట్‌పల్లిలో శాఖా గ్రంథాలయాల ఏర్పాటుకు జిల్లా గ్రంథాల సంస్థ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, రాష్ట్ర విద్యాశాఖ ఆమోదంతోనే కొత్త గ్రంథాలయాల ఏర్పాటు జరుగనున్నాయి. భవనాలే కాకుండా వాటిలో రూ.15లక్షల వ్యయంతో అనేక పుస్తకాలు అందుబాటులో ఉంచనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించగా.. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే కొత్త పుస్తకాలు కొనుగోలు చేయనున్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థకు సెస్ రూపంలో ప్రతి సంవత్సరం రూ.50లక్షల వరకు ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా రూ.40లక్షల వరకు వస్తున్నది. అన్ని గ్రామపంచాయతీల నుంచి సెస్ రూపంలో డబ్బులు గ్రంథాలయ సంస్థకు సమకూరుతాయి. గ్రామపంచాయతీలకు సంబంధించి ఆడిట్ పేరాలు తొలగించుకోవాలని కలెక్టర్ ఇటీవల ఆదేశించారు. దీంతో డబ్బులు అన్ని గ్రామపంచాయతీలు గ్రంథాలయ సెస్ చెల్లిస్తున్నాయి. తద్వారా గ్రంథాలయ సంస్థకు మరింత ఆదాయం పెరిగే అవకాశమున్నది. మరోవైపు ప్రభుత్వం సర్కారు బడుల రూపురేఖలు పూర్తిస్థాయిలో మార్చే విధంగా మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నది. ఇందులో ప్రధానంగా ప్రతి ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనగా ఉన్నది. దీనికి సంబంధించి నిధులు గ్రంథాలయ సంస్థ ద్వారా వెచ్చించాలని స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో సూచించారు.
జిల్లా పరిధిలో ఇప్పటికే కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ల్లో గ్రంథాలయాలను కొత్త భవనాల నిర్మించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. తాండూరులోనూ కొత్త భవనం నిర్మిస్తాం. కొత్తగా ఏర్పడిన చౌడాపూర్, కోట్‌పల్లి మండలాల్లో నూతన గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వికారాబాద్‌లో నిర్మించిన కొత్త భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం.
-మురళీకృష్ణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్