హయత్‌నగర్ రూరల్, మార్చి 4: కరోనా లాక్డౌన్ సమయంలో మాస్కు లేకుండా తిరిగి, జరిమానా బారిన పడ్డ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు పోలీసులు చక్కటి అవకాశం కల్పించారు. లాక్డౌన్ సమయంలో మాస్కు లేనివారిపై 51(బీ) డీఎం యాక్ట్ కింద పెట్టీ కేసు బుక్ చేశారు. రూ. వెయ్యి జరిమానా విధించారు. అయితే, రూ.100 మాత్రమే చెల్లించేలా పోలీసులు వెసులుబాటు కల్పించారు. శనివారం ఉదయం హయత్‌నగర్‌లోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసే లోక్‌అదాలత్‌లో రూ.100 ఫైన్ చెల్లించే అవకాశం కల్పించినట్లు అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ స్వామి తెలిపారు. ఒక్క రోజే ఈ అవకాశం ఉంటుందని, మండలంలోని ఫైన్బారిన పడ్డవారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేదంటే ఆపై యథావిధిగా రూ.1000 జరిమానా చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు.
యాచారం, మార్చి 4: మాస్కులేకుండా రూ.1000 ఫైన్‌కు గురైనవారు రూ.100 మాత్రమే చెల్లించే ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఐ లింగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఒక్క రోజు ఈ అవకాశం ఉందని, ఇబ్రహీంపట్నంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న వైష్ణవి గార్డెన్లో జరిమానా చెల్లించాలని సూచించారు. ఆదివారం నుంచి యథావిధిగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.