పూడూరు, మార్చి4 : విద్యార్థులకు మెరుగైన బోధన, సరిపడా మౌలిక వసతులుండటంతో ఎన్కెపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యాబోధనలో భాగంగా మండలంలోని ఎన్కెపల్లి గ్రామం, మన్నెగూడ-వికారాబాద్ రోడ్డు పక్కన ఉన్న ఆదర్శ పాఠశాలలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు చదువును అందిస్తున్నది. కాగా పాఠశాల ప్రారంభమైన సమయంలో విద్యార్థులు ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఇటీవల వికారాబాద్-మన్నెగూడ రోడ్డు ఉంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో ఈ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలో ఆరు నుంచి పదోతరగతి వరకు 492 మంది విద్యార్థులు.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 232 మంది విద్యార్థ్థులు చదువుకుంటున్నారు. ఈ మోడల్ స్కూల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. పాఠశాలకు విశాలమైన స్థలం ఉండటంతో నిత్యం సాయం త్రం సమయంలో విద్యార్థులు వివిధ రాకల ఆటలాడుతూ రాణిస్తున్నారు. ఇక్కడ మండల పరిధిలోని విద్యార్థులే కాకుండా పరిగి, కులకచర్ల, వికారాబాద్, ధారూరు, నవాబుపేట మండలాలకు చెందిన విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. గత నాలుగేండ్లుగా పదోతరగతి పరీక్షల్లో ఈ పాఠశాలలోని విద్యార్థులే మండలంలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. ఇంటర్లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఏడాది కేటాయించిన సీట్లు భర్తీ అవుతుండటంతో చాలా మంది విద్యార్థులు నిరుత్సాహంతో తిరిగి వెళ్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ల్యాబ్, గ్రంథాలయం వంటి వసతులున్నాయి. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తూ.. సందేహాలుంటే నివృత్తి చేస్తున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్చిందుకు ఇష్టపడుతున్నారు
2022-23 విద్యాసంవత్సరం లో ఆదర్శ పాఠశాలల్లో చేరేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎన్కెపల్లి సమీపంలోని మోడల్ స్కూల్లో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రుల మీసేవ ద్వారా ఆన్లైన్లో మార్చి 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి మొదటి ప్రాధాన్యముంటుంది. ఈ పాఠశాలకు పలు మండలాలకు చెందిన బాలబాలికలు వచ్చి చదువుకుంటున్నారు. దూర ప్రాంతాలకు చెందిన బాలికలు ఉండి చదువుకునేలా ప్రభుత్వం వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ సరిపడా మౌలిక వసతులున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన బోధనను అందిస్తున్నారు. – శ్రీదేవి, ప్రిన్సిపాల్ పూడూరు