యాచారం, మార్చి4: అది ఓ చిన్న గ్రామం. ఆ ఊరులోని రైతులందరూ వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితో ఆధునిక పద్ధతిలో ఆరుతడి పంటలను సాగుచేస్తూ ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అక్కడి రైతులు కూరగాయల సాగుతో తక్కువ శ్రమ, పెట్టుబడితో అధిక లాభాలను సాధిస్తున్నారు.మండలంలోని చౌదర్పల్లి గ్రామరైతులు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులను అను సరిస్తున్నారు. రైతులు తమ పంట పొలాల్లో వరి, పత్తి, ఆముదం, జొన్న వంటి పంటలనుఅసలే సాగు చేయడంలేదు. ఏ రైతు పొలాన్ని పరిశీలించినా టమాట, వంకాయ, బెండ, సొర, మునగలాంటి కూరగాయలతోపాటు కాకర, బీరకాయ, దొండ, చిక్కుడులాంటి తీగజాతి పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీల్లో అధికంగా కూరగాయలను సాగుచేసే గ్రామం గా చౌదర్‌పల్లికి ఎంతో గుర్తింపు ఉంది. గత 30 ఏండ్లుగా రైతులు ఈ పంటలనే సాగు చేస్తున్నారు. గ్రామంలో దాదాపుగా 200 మందికి పైగా రైతులు కూరగాయలను సాగుచేస్తుండగా అం దులో 150 మందికిపైగా రైతులు డ్రిప్ పద్ధతిలో ఆరువందలకు పైగా ఎకరాల్లో కూరగాయలను సాగు చూస్తూ.. నీటి వృథాను అరిక ట్టి, ఆధునిక యంత్ర పరికరాల సహకారంతో అధిక దిగుబడులను సాధిస్తున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పలుమార్లు గ్రా మాన్ని సందర్శించి రైతులకు మరిన్ని సలహా లు, సూచనలు అందించి ప్రోత్సహించారు. చౌదర్పల్లి రైతులు తిండి గింజల కోసం ఒకటి, రెండు గుంటల్లో వరిని సాగుచేస్తూ.. మిగతా పొలంలో రకరకాల కూరగాయలను పండించి శభాష్ అనిపించుకుంటున్నారు. నీటి ఎద్దడి ఉన్నా ఆధునిక పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేస్తూ లాభాలను పొందొచ్చని ఇక్కడి రైతులు నిరూపిస్తున్నారు.
రైతులు తమ ఉత్పత్తులను సాయంత్రం సమయంలో తెంపి వాటిని సంచుల్లో నింపుకొని తెల్లవారుజామునే డీసీఎంలు, ఆటోల్లో హైదరాబాద్‌లోని రైతుబజార్‌కు తరలిస్తారు. స్వయంగా వారే కూరగాయలను విక్రయించుకుని అధిక లాభాలను పొందుతున్నారు. ఒక్కో రైతు నిత్యం రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేల వరకు సంపాదించి, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రైతులు రైతుబజార్‌కు తాజా కూరగాయలను తీసుకురావడంతో వాటికి మంచి డిమాండ్‌తోపాటు ధర కూడా లభిస్తున్నది.
నాకు ఉన్న పొలంలో కూరగాయలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నా. పండిన ఉత్పత్తులను స్వయంగా మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించి వచ్చిన డబ్బుతో కుటుంబా న్ని పోషిస్తున్నా. మార్కెట్లో తాజా కూరగాయలకు మంచి డిమాండ్ ఉన్నది. ధర కూడా లభిస్తున్నది. మా గ్రామంలో వరి, పత్తి, ఆముదం, జొన్న వంటి పంటలను అసలే సాగు చేయడంలేదు.
-కాశమల్ల రాములు, చౌదర్పల్లి రైతు