యాలాల, మార్చి 3 : యాలాల మండలం రాఘవాపూర్ పల్లె ప్రగతితో శుభ్రంగా మారడంతో పాటు గ్రామంలో కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. దీనికి తెలంగాణ సర్కారు చేయూత.. ప్రజాప్రతినిధుల సహకారం.. ప్రజల ఐక్యతే నిదర్శనం. సీసీ రోడ్లు, రాత్రి వేళలో జిగేల్మనే లైట్లు, ఏపుగా పెరిగిన మొక్కలు గ్రామంలోకి స్వాగతం పలుకుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచే చెట్లు, ఇంటింటికీ సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి తడి, పొడిగా వేరు చేసి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు.
గ్రామ జనాభా 745 మంది. రూ.3లక్షలతో డంపింగ్‌యార్డ్, రూ. లక్షా 20వేలతో పల్లెప్రకృతివనం పనులు చేపట్టారు. వైకుంఠధామం పనులు పురోగతిలో ఉన్నాయి. నర్సరీలో వివిధ రకాల 11వేల మొక్కలు పెంచుతున్నారు. అందులో 6,500 మొక్కలను పంపిణీ చేశారు. 5 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో 7 రకాలకు చెందిన 400 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నాటిన 200 మొక్కలు ప్రయాణికులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రతి రోజూ తడి, పొడి చెత్తను సేకరించి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్‌యార్డ్‌కు పంచాయతీ కార్మికులు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఈ ఎరువును నాటిన మొక్కలతోపాటు పొలాల్లో కావలసిన రైతులకు అందిసున్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు.
రెండేండ్ల కాలంలో రూ.35లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.10 లక్షల డీఎంఎఫ్టీ నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలోని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు పలు రూ.14.5లక్షల జీపీ నిధులతో పలు అభివృద్ధి పనులను పూర్తి చేశారు.
సీజన్ వ్యాధులు సోకకుండా కాలనీల్లో ప్రత్యేకంగా బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి గ్రామస్తుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. పనులను ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతుండడంతో గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకొంటున్నాం. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నది. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించాం. ప్రతి వీధి శుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతిరోజూ చెత్త సేకరణ చేస్తున్నాం. తడి, పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా కంపోస్టుయార్డుకు తరలిస్తున్నాం. దోమల నివారణకు మందులను పిచికారీ చేయిస్తున్నాం. సంపూర్ణ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– గోపాల్, పంచాయతీ కార్యదర్శి
పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెకు కొత్తందం వచ్చింది. అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొంటున్నాం. పల్లెప్రగతి ద్వారా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఆధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పల్లెప్రగతి పనులను పూర్తి చేశాం.
– లక్ష్మీదేవి, సర్పంచ్ రాఘవాపూర్