పట్టణాభివృద్ధిలో టీపీవో (టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్)ల పాత్ర కీలకం. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో టీపీవోల కొరత వేధిస్తున్నది. వారి కొరతతో పలు పురపాలక సంస్థల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. భవన నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు టీపీవోలు అందుబాటులో లేని కారణంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఒక్కొక్క టీపీవో మూడు నుంచి నాలుగు మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో వారు ఒక్కొక్క మున్సిపాలిటీలో రెండురోజుల చొప్పున షిప్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. దీంతో టీపీవోలు ఏ రోజు ఏ కార్యాలయాలకు వస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెల కొన్నది. వారి కొరత కారణంగా నూతన నిర్మాణాలకు అనుమతులలో ఆలస్యంతోపాటు అక్రమ నిర్మాణాలను అరికట్టలేకపోతున్నారు. జిల్లాలో 13 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. 13 మున్సిపాలిటీలకు కేవలం ఐదుగురు మాత్రమే టీపీవోలు ఉన్నారు. అలాగే, కార్పొరేషన్లకు ఒక్క ఏఎస్పీ, ఒక్క టీపీవో, ఇద్దరు టీపీపీవోలు, ఇద్దరు చైర్మన్లు, మరో ఇద్దరు కార్యాలయ సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్లలోనూ టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. టీపీవోల కొరత కారణంగా కమిషనర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
– రంగారెడ్డి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో 13 మున్సిపాలిటీలున్నాయి. ఇవి నగరం చుట్టూ విస్తరించి ఉండడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అనేకమంది ఈ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలు చేపట్టేందు కు ముందుకొస్తున్నారు. దీంతో వారు భవన నిర్మాణాల అనుమతుల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్-బీపాస్ కింద దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపే అనుమతులివ్వాలని నిబంధన పెట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలోని శంషాబాద్, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట, తుక్కుగూడ, జల్పల్లి, నార్సింగి, మణికొండ, శంకర్పల్లి, శంషాబాద్, షాద్‌నగర్, ఆమనగల్లు మున్సిపాలిటీలున్నాయి.
బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, షాద్‌నగర్ మున్సిపాలిటీలకు ఒకే ఒక్క టీపీవో ఉన్నారు. ఈ అధికారి ఇబ్రహీంపట్నంలో శుక్ర, శనివారాల్లో, తుర్కయాంజాల్‌లో సోమ, మంగళవారాల్లో, షాద్‌నగర్‌లో బుధ, గురువారాల్లో అందుబాటులో ఉంటున్నారు. అలాగే తుక్కుగూడ, ఆమనగల్లు, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాలకు టీపీవో షిఫ్టు పద్ధతిలో రెండు రోజుల చొప్పున పని చేస్తున్నారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో టీపీవో ఒక్కరోజు మాత్రమే ఉంటున్నారు. జల్పల్లి, ఆదిబట్ల, శంషాబాద్ మున్సిపాలిటీల్లో ఒకే టీపీవో అందుబాటులో ఉంటున్నారు.
టీపీవోలు మున్సిపాలిటీల అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తారు. మున్సిపాలిటీలో చేపట్టే ప్రతి భవనానికీ వారు అనుమతులివ్వాలి. అనుమతి చేసుకున్న భవనాలు ఇతరత్రా గృహ నిర్మాణాలను టీపీవోలు స్వయంగా వెళ్లి చూసిన తర్వాతే అనుమతులివ్వాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో జీ ప్లస్-2కు మాత్రమే టీపీవోలు అనుమతులిస్తారు. జీప్లస్-3 నిర్మాణాలు చేపట్టాలనుకునేవారు పదిశాతం భూమిని మున్సిపాలిటీలకు మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే అనుమతులిస్తారు. అనుమతుల్లేని నిర్మాణాలను గుర్తించి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. మున్సిపాలిటీల్లో ఉన్న పార్కు స్థలాలనూ పర్యవేక్షిస్తుంటారు. టీపీ వోల కొరత కారణంగా పైన పేర్కొన్నవి సవ్యంగా సాగడం లేదు. ప్రభుత్వం టీపీవోల పోస్టులను భర్తీ చేసి ఇబ్బందును తొలగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
టీపీవోల కొరత కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరు గా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతుల్లేకుండానే పలువురు ఐదు నుంచి ఆరు అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో జీప్లస్-2తో పాటు పదిశాతం భూమిని మార్టిగేజ్ చేస్తేనే మరో అంతస్తు నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతులిస్తారు. అంతకు మించి జరిగే నిర్మాణాలన్నింటికీ హెచ్ఎం డీఏ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ కొందరు హెచ్ఎండీఏ నుంచి అనుమతి లేకుండానే పలు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున బహుళ అంతస్తులను నిర్మిస్తూ ము న్సిపాలిటీల ఆదాయానికి గండికొడుతున్నారు.
అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన అధికారుల కొరత తీవ్రంగా ఉండడంతో ఆయా టీపీవోలు.. ఇద్దరు లేదా ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ వ్యక్తులే ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి.. ఎన్నింటికీ అనుమతులున్నాయి అనే వాటిని పర్యవేక్షిస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న వాటిపైనా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. అలాగే, అనుమతుల్లేకుండా వెలుస్తున్న భవనాలకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడా అసెస్మెంట్లు వేయకపోవడంతో ప్రాపర్టీ ట్యాక్స్‌ను ఎవరూ చెల్లించడంలేదు. దీంతో మున్సిపాలిటీల ఆదాయానికి గణనీయంగా గండి పడుతున్నది.