మొయినాబాద్, మే 31: విత్తనాల కొరత లేకుండా.. రైతులకు అన్ని రకాల సీడ్స్‌ను అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం మొయినాబాద్ మండల కేంద్రంలోని బాలాజీ ఫర్టిలైజర్ దుకాణాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డితో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, విత్తనాలు, బిల్లుబుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో లూజుగా విక్రయించరాదన్నారు. విత్తనాలు, ఎరువులను ఎంఆర్పీ ధరలకు విక్రయించాలని, లేనిచో చర్యల తప్పవని హెచ్చరించారు.
రైతులకు తప్పని సరిగా బిల్లులు ఇవ్వడంతోపాటు ఆ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అనంతరం ఏకరూప దుస్తులను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించిన నేపథ్యంలో మొయినాబాద్ మండలం చిలుకూరులోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇప్పటివరకు ఎన్ని జతల యూనిఫామ్‌లు కుట్టారు.. ఇంకా కుట్టాల్సినవెన్ని.. క్లాత్ అందుబాటులో ఉన్నదా.. లేదా వంటి వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు సకాలంలో అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ గౌతమ్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, ఆర్ఐ చంద్రమోహన్, ఏఈవో సునీల్, డీలర్ బాల్‌రెడ్డి, ఏపీఎం రవీందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ తదితరులు ఉన్నారు.