శంకర్పల్లి, ఫిబ్రవరి 8 : ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకుడినే గెలిపించుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శంకర్‌పల్లిలోని 2, 3,11 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుందని, ఇప్పటివరకూ ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.
మహిళలకు రూ.2500 , విద్యార్థునులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం, రైతుభరోసా, గర్భిణులకు న్యూట్రిషన్ కిట్, కేసీఆర్‌కిట్, ఆసరా పింఛన్ వంటి తదితర పథకాలను పూర్తిగా మరిచిపోయిందని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం, పదవుల కోసం పార్టీలు మారే వారిని నమ్మొద్దన్నారు. వారికి ఓటుతోనే బుద్ది చెప్పాలన్నారు. మీకు సమస్య వచ్చినప్పుడు తక్షణమే స్పందించి, ప్రజాసేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు. శంకర్పల్లి మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, బద్రిప్రభుగౌడ్ పాల్గొన్నారు.
పామెన, మలాపూర్ వార్డుల్లో..
చేవెళ్ల రూరల్ : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు నిరాశే మిగిల్చిందని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, చేవెళ్ల మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి పట్లొళ్ల కార్తీక్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం పామెన, మలాపూర్ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాకలిగూడెం పాండు, శేరి పావనిశివారెడ్డి తరఫుర ప్రచారం నిర్వహించారు. వార్డుల్లోని ప్రజలను కలుస్తూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే బీఆర్ఎస్, నిరాశ అంటే కాంగ్రెస్ అన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయా వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట రంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శేఖర్ రెడ్డి, కమ్మెట మాజీ సర్పంచ్ పట్లోళ్ల హన్మంత్ రెడ్డి, వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.