కరువొచ్చింది.. పొలాలకు నీరు మళ్లించవయ్యా సారూ..అంటే అసలు సమస్య నుంచి జనాల దృష్టి మళ్లిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం నుంచి కాపాడాల్సిందిపోయి విపరీత అర్థాలతో వ్యాఖ్యలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇట్లున్నది కాంగ్రెస్ పాలకుల పరిస్థితి. ఎక్కడో జపాన్ దేశం అవతల పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు వేడెక్కితే దాని ప్రభావం భారతదేశంలోని రుతుపవనాలపై పడుతుంది. దానినే ఎల్ నినో అంటారు. ఈ ఏడాది ఎల్ నినో వస్తుంది, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ వాతావరణ సంస్థ ఎప్పటినుంచో హెచ్చరిస్తునే వస్తున్నది. వాటిని పట్టించుకోని పాలకులు వింతవాదన ముందుకు తెచ్చారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నందు వల్లనే వర్షాలు కురువడం లేదని విచిత్ర ప్రచారం చేస్తున్నారు. వర్షాలు కురువాలని వరుణ జపాలు, సుదర్శన హోమాలు, విరాటపర్వ పారాయణాలు, కప్పల పెండ్లిండ్లు జరుపడం అందరికీ తెలిసిందే. వరదలు వచ్చినప్పుడు నదులు శాంతించాలని పసుపు నీటితో గంగ పూజ చేసే ఆచారం కూడా ఉన్నది. కానీ వర్షాలు కురువకూడదని క్షుద్ర పూజలు చేయడం ఏమిటో? విశ్వశాంతి యాగాలు గురించి విన్నాం. కానీ, కరువు రావాలని పూజలు చేస్తారా? అలాంటివి కాంగ్రెస్ వారికి తెలుసేమో మరి? బాధ్యతల నుంచి తప్పించుకునే చిల్లర ప్రయత్నమే ఈ కుటిల విమర్శ. నిజానికి ఒక్క తెలంగాణ కోసమే కాదు..లోక కల్యాణం కోసం యజ్ఞయాగాదులు చేయడం కేసీఆర్ ప్రత్యేకత. తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా అందరి సంక్షేమం కోసం ఆయన అయుత చండీయాగం నిర్వహించారు. ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రముఖులే హాజరై కేసీఆర్ సంకల్పాన్ని మెచ్చుకున్నారు.
ఉత్తర తెలంగాణలోని నీటిని దక్షిణ తెలంగాణకు మళ్లించే కాళేశ్వరం ప్రాజెక్టు ఉండగా దానిని ఉపయోగించుకోవడం లేదు. దాని నుంచి దృష్టి మళ్లించడానికే హరీశ్‌రావుపై ఊహాజనిత ఆరోపణలు. వాటిని ఎవరు విశ్వసిస్తారు? ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరోసారి చెప్పుకోక తప్పదు. కరవును శాశ్వతంగా నివారించడానికి, ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నిర్మించిన ‘గొలుసుకట్టు ఎత్తిపోతల పథకాల’ సమాహారం ఇది.
ఈ ప్రాజెక్టు రిజర్వాయర్లకు కూడా ప్రత్యేకత ఉన్నది. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ మాదిరిగా ఏడాది పొడవునా వందల టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు ఇవి కావు. అవసరమైనప్పుడు నీటిని నిల్వ చేసి ఎప్పటికప్పుడు పంపుల ద్వారా నీటిని తోడి పైకి పంపించడమే వీటి లక్ష్యం.
మోటర్లు ఆన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు గేట్లు తెరిచి నీటిని కిందికి విడిచిపెడుతారు. అందుకే వీటిని స్టోరేజీ రిజర్వాయర్లని అనడం కన్నా రియల్‌టైమ్ రిజర్వాయర్లు అనడమే సబబు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్‌తోపాటు ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, ఇతర వాగుల నుంచి వచ్చే నీటిని అంచనా వేసి మోటర్లు ఆన్చేయాలా వద్దా అనేది రియల్ టైమ్‌లో ఇంజినీర్లు నిర్ణయం తీసుకుంటారు. ప్రాజెక్టు ఇంజినీర్లు ఈ అంచనాలు వేయడంలో ఏమాత్రం లెక్క తప్పినా నిల్వచేసిన నీటిని కొన్నిసార్లు కిందికి వదలాల్సి ఉంటుంది. ఒకసారి రిజర్వాయర్‌ను నింపిన తర్వాత తిరిగి గేట్లు ఎత్తడం. ఒకసారో రెండుసార్లో అలా జరిగినా శాస్త్రీయ అధ్యయనం ద్వారా దానిని అరికట్టడం ఇంజినీర్లకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. దానిని గమనించకుండా విమర్శలు చేయడం ప్రాజెక్టు స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోవడమే. అందుకే హరీశ్‌రావుపై అర్థంలేని ఆరోపణలు.
నిర్మాణంలో లోపాల వల్ల రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేయలేకపోతున్నామని, అందువల్ల మోటర్లు ఆన్చేయలేకపోతున్నామని ప్రభుత్వం మరో కుంటిసాకు చెప్తున్నది. ప్రస్తుత కరవు రోజుల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసైనా సరే మోటర్లు ఆన్‌చేయడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ప్రాజెక్టులో కొంత భాగం దెబ్బతింటే మొత్తం చెడిపోయినట్టు భావించి అత్యవసర పరిస్థితిలోనూ ఉపయోగించుకోలేకపోవడం దారుణం. ఇప్పుడు కాళేశ్వరంపై కాకుండా తమ్మిడిహట్టిపై దృష్టి పెడితే తక్షణావసరాలు తీరవు. దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించిన హరీశ్‌రావుపై అర్థం లేని ఆరోపణలు చేస్తే వెర్రితనమే అవుతుంది. కన్నెపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయాలని సూచించిన బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ మీదా పాలక పెద్దలు అనుచిత విమర్శలు చేశారు. పొలాలకు నీరెందుకు? ‘ఆ ముగ్గురి (కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు) రక్తం పారిస్తే సరిపోదా’ అని స్వయంగా ముఖ్యమంత్రే అన్నారంటే మిగిలినవారు క్షుద్ర విమర్శలు చేయకుండా ఉంటారా? కరువు రోజుల్లో నీటిని పారించడం చేతకాక, చెప్పుకోవడానికి చేసిందేమీ లేక, బీఆర్ఎస్ను ఎదుర్కొనే సమర్థత లేక మంత్రతంత్రాలంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో గోదావరి నీటిని ఉపయోగించుకునే ప్రణాళిక లేక నెపాన్ని వేరేవారి మీద నెట్టివేయడాన్ని ప్రజానీకం హర్షించదు. పీసీసీ అధ్యక్షుడు, ఉన్నత విద్యావంతులైన ఎమ్మెల్సీ, పార్టీ అధికార ప్రతినిధులు ఈ తరహా విమర్శలు చేశారంటే లోతైన వ్యూహం ఉండే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించాలన్న ఆలోచన ఉండి ఉండవచ్చు.
సకాలంలో మరమ్మతులు చేయకపోతే ప్రజాధనం నిజంగానే వృథా అవుతుంది. అప్పుడు గంగ పూజ బదులుగా కాంగ్రెస్ క్షుద్ర పూజలు చేసినట్టుగానే భావించాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కాళేశ్వరం ఆదుకుంటుందన్న వాస్తవాలను అంగీకరించలేకనే ప్రజలను తప్పుదోవపట్టించే విమర్శలు చేస్తున్నారు. సంకల్ప శుద్ధిలేదన్నది పాలకుల మాటల్లోనే తెలిసిపోతున్నది.
హరీశ్‌రావు పక్క రాష్ర్టాలకు వెళ్లి పూజలు చేస్తే కాంగ్రెస్ వారికి అనుమానాలు ఎందుకు? వాటిని తప్పుపట్టడం ఏమిటి? ఆ పుణ్య క్షేత్రాలేవీ నిషిద్ధ ప్రాంతాలు కావు. తెలంగాణ వస్తే బోనం ఇస్తామని ఎల్లమ్మకు మొక్కుకున్నవారు ఇప్పుడు కరువు రావాలని పొరుగు రాష్ర్టాలకు వెళ్లి పూజలు చేస్తారా? కాళేశ్వరం మరమ్మతులకు ప్రయత్నాలు చేయకుండా మొత్తం రూ.లక్ష కోట్లు వృథా అయిందని దుష్ప్రచారం చేయడం తప్పా రైతులకు తక్షణ సాయం అందించడంపై ఆలోచనలే చేయడం లేదు. పైగా మూఢనమ్మకాల ప్రచారం. అర్థంపర్థం లేని ఆరోపణలు. హరీశ్‌రావును ఏదో ఒక రీతిలో బదనాం చేయాలన్న రాజకీయం చేయడం తప్ప మరొకటి కాదు.