ఇబ్రహీంపట్నం, జులై 17 : అదును దాటిపోతున్న వర్షాకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాతల్లో రోజురోజుకు ఆవేదన పెరిగిపోతుంది. అదును దాటిపోతున్నా వర్షాలు కురియకపోవడంతో పంటలు వేసుకోవడానికి సిద్ధం చేసుకున్న దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటడానికి సిద్దంగా ఉన్న నారుమల్లు ముదిరిపోతున్నాయి. ఈ పరిస్థితిలో అన్నదాత వర్షాల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
అలాగే, సాదారణ వర్షపాతంలో సగంకూడా నమోదు కాకపోవడంతో వర్షాకాల పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, గత జూన్ మాసంలో కురిసిన అంతంతమాత్రం వర్షాలకు కొంతమంది రైతులు పత్తి, మొక్కజొన్న వేసినప్పటికి ఆ తర్వాత వర్షాలు కురియకపోవడం వలన మొలకెత్తిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో పలుచోట్ల రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకువచ్చి ఎండిపోతున్న పంటలకు పోసి ప్రాణం పోస్తున్నారు.
మరోవైపు జులై మాసంలోనైనా వర్షాలు కురుస్తాయని భావించి దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై మబ్బులతో కమ్ముకుంటున్నప్పటికి వర్షాలు కురియడంలేదు. వేసవి ఎండలను తలపించే రీతిలో భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో ఈ వర్షాకాలంలో పంటలసాగు అగమ్యగోచరంగా మారింది.
ముఖ్యంగా రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా ఈ వర్షాకాలంలో సాధారణ వర్షాపాతంలో ఇరవై నుంచి ముప్పైశాతం కూడా వర్షాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రైతులు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈ సంవత్సరమైనా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భావించిన రైతులకు నిరాశ మిగిలింది.
గణనీయంగా తగ్గిపోయిన సాగు విస్తీర్ణం..
రంగారెడ్డిజిల్లాలో వర్షాలు అనుకూలించకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ వర్షాకాలంలో జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, పంటలు పెద్ద ఎత్తున సాగుచేయాలని రైతులు దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచినప్పటికి పలు నియోజకవర్గాల్లో వర్షాలు కురవకపోవడంతో పంటలసాగు ప్రశ్నార్ధకంగా మారింది.
అదును దాటుతున్నా జాడలేని వానలు
– ఇబ్రహీం, రైతు
అదును దాటిపోతున్నప్పటికి వర్షాలు కురియకపోవడంతో పంటలు వేసుకోవడానికి సమయం కూడా దాటిపోతుంది. ఇప్పటికే నారుమల్లు వేసి సిద్దంగా ఉంచినప్పటికి వర్షాలు కురియకపోవడంతో వరినారుమల్లు ముదిరిపోతున్నాయి. మొక్కజొన్న, పత్తి పంటలు కూడా వేసుకోవడం కష్టంగానే మారింది. ఏడెంకల పంటలు వేస్తే అది గిట్ట్టుబాటు కూడా అయ్యే అవకాశం ఉండదు. దీంతో వర్షాకాలంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
కష్టంగా మారిన సాగు
– హన్మంతరెడ్డి, చర్లపటేల్గూడ
ఈ ఏడాది వానలు వెనక్కి అయ్యాయి. గత జూన్ నెలలో కురిసిన అంతంత మాత్రం వర్షాలకు దుక్కులు దున్ని విత్తనాలు విత్త టంలో మొలకలు వచ్చాయి. వర్షాలు కురి యకపోవటంతో మొలకలు ఎండుముఖం పడుతున్నాయి. ఎండిపోతున్న పంటలతో ఇబ్బందికరంగా మారు తోంది. కష్టపడి డబ్బులు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటమొలక దశలోనే ఎండిపోతున్నాయి. వరుణుడు కరుణిస్తే పంటలకు జీవం పోసినట్లవుతోంది. వర్షాలు కురిస్తేనే గట్టెక్కుతాం.