‘ మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చడం.. ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే చేరిన వేల మంది విద్యార్థులతో సర్కార్ స్కూళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 13వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా.. వికారాబాద్ జిల్లాలో 5,883 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. వీరిలో సగం అడ్మిషన్లు ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవే. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది. ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంతో అన్ని తరగతుల్లోనూ ప్రవేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడ్డ వసతులు, బోధనా నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి చెబుతూ వారిలో చైతన్యం తెచ్చే దిశగా చొరవ చూపడం కలిసొచ్చింది. మరోవైపు ప్రైవేటు బడుల్లో అధికంగా ఫీజులు వసూలు చేయడం, ప్రతీది కొనాల్సిన పరిస్థితి నేపథ్యంలో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ బడులను ఆశ్రయిస్తున్నారు.
-రంగారెడ్డి, జూన్ 24 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో సమూల మార్పు వస్తున్నది. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుండడంతోపాటు ఆంగ్ల బోధనను అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపుదిద్దుకుంటుండడంతో సర్కారు బడుల్లో కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం, మౌలిక సదుపాయాలను కల్పించడంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో సర్కారు బడులవైపు విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్ షీట్స్, రెండు జతల యూనిఫాంలను కూడా ఉచితంగా అందిస్తుండడంతోపాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల దత్తత తదితర కార్యక్రమాలతో రెండేండ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే ఒరవడి కనిపిస్తున్నది.
ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజుల మోత తప్పకపోవడం.. తల్లిదండ్రులకు ఇది భారం కావడం వంటి కారణాలు.. వారిని ప్రభుత్వ పాఠశాలలవైపుగా అడుగులు వేయిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చెబుతున్న పాఠాలకు, కార్పొరేట్ పాఠశాలల్లో అందిస్తున్న విద్యాబోధనకు పెద్దగా తేడా ఉండడం లేదన్న భావన కూడా తల్లిదండ్రుల్లో వచ్చింది. వేల రూపాయల ఫీజులు చెల్లించే బదులు ఉత్తమ విద్యా బోధన, ఎన్నో వసతులున్న సర్కారు పాఠశాలల్లోనే చేర్పించడం నయమంటూ చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో డిజిటల్ బోధన కూడా అమలులో ఉన్నది. రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకుల్లో ప్రతిభ కనబర్చడం, ట్రిపుల్ ఐటీ, జాతీయ ఉపకార వేతనాలకు అర్హత పొందడంలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులదే పైచేయిగా ఉండటం వంటి అనుకూల పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలకు వరంగా మారాయి.
ఈ నెల 3 నుంచి జిల్లాలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి, ర్యాలీలు నిర్వహించి, కరపత్రాలను పంపిణీ చేశారు. బడీడు పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు, ఇంగ్లిష్ మీడియం అమలుకు సంబంధించి ఉపాధ్యాయులు తెలియజేయడంతో సత్ఫలితాలనిచ్చింది. అంగన్వాడీల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నవారిని ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువులు పూర్తయినవారు ఉన్నత పాఠశాలల్లో చేరేలా శ్రద్ధ చూపించారు.
రంగారెడ్డి, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కొత్తగా 13వేల మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. జిల్లాలో 1,300 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 881, ప్రాథమికోన్నత పాఠశాలలు 181, హైస్కూళ్లు 248 ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 13 నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 13వేల మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు.
పాఠశాల పేరు విద్యార్థులు
హయత్‌నగర్ 1,190
సరూర్‌నగర్ 1,132
జిల్లెలగూడ 1,218
మైలార్‌దేవ్‌పల్లి 927
శివరాంపల్లి 1,196
మణికొండ 1,185
శేరిలింగంపల్లి 1,029
మియాపూర్ 956
కొత్తగూడ 910
‘మన ఊరు..మన బడి’ కింద జిల్లాలో 464 పాఠశాలలను తొలివిడతలో ఎంపిక చేశారు. రూ.97.88కోట్ల వ్యయంతో పనులను చేపట్టారు. గతంలోనే 11 పాఠశాలలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురాగా.. దశాబ్ది ఉత్సవాల్లో మరో 40 పాఠశాలలను ప్రారంభించారు. మిగిలిన 413 పాఠశాలల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.
– నిహారిక, చేవెళ్ల మోడల్ స్కూల్ విద్యార్థిని
పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం బాగుంది. గతంలో ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లాలంటే భయపడేది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సర్కారు బడుల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందుతున్నది. దీంతోపాటు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తున్నారు.
– వాసవి, పదో తరగతి, షాబాద్
మా పాఠశాలలో టీచర్లు ఇంగ్లిష్‌లో పాఠాలు బోధిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని సర్కార్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నాణ్యమైన విద్యతో పాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుకునే స్థోమత లేని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయడం గొప్ప పరిణామం.
– వంశీ, 8వ తరగతి, శంకర్పల్లి పాఠశాల
బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన భోజనం పెట్టడం గొప్ప విషయం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు కొత్త కళ వచ్చింది. సర్కారు బడుల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.
– ఎదిరె రాములు, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల
రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య, సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా, ఏ సర్కారూ చేయని విధంగా బీఆర్ఎస్ సర్కారు పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నది. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నారు.
వికారాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5883 మంది విద్యార్థులు చేరారు. జిల్లావ్యాప్తంగా 1089 ప్రభుత్వ పాఠశాలలుండగా, 852 ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్లు జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించి 266 మంది విద్యార్థులు కొత్తగా చేరగా, ఒకటో తరగతిలో అంగన్వాడీ కేంద్రాల నుంచి 4604 మంది, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 370 మంది, నేరుగా 909 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
– జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి
మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మంచిరోజులు వచ్చాయి. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని గత విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావడంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా చేరుతున్నారు. మన ఊరు-మన బడితో తల్లిదండ్రుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.
– బుజ్జీబాయి, పూర్యానాయక్తండా
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉచితంగా బట్టలు, కాపీలు, పుస్తకాలు ఇస్తూ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ప్రైవేటుకు పంపకుండా నా కొడుకు అజయ్, కూతురు రజితలను తండాలోని పాఠశాలకు పంపిస్తున్నా.
జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 1903 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. ఒకటో తరగతిలో 370 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు 1533 మంది విద్యార్థులు చేరారు.