పూడూరు, ఫిబ్రవరి 8: నేవీ రాడార్ సిగ్నల్ సెంటర్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే అందమైన ప్రకృతి దెబ్బతినే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ లక్షల్లో ఉన్న ఆయుర్వేద మొక్కలు, జంతువులు, పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు మేధావులు, శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ సిగ్నల్ సెంటర్ ఏర్పాటు వద్దంటూ అటవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘ప్రకృతి విధ్వంసం పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.
రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రేడియేషన్ ప్రభావంతో ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక రోగాలబారిన పడుతారని పలు శాఖల ఉన్నతాధికారులకు ఎన్నోమార్లు వినతి పత్రాలను సమర్పించినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో నేవీ అధికారులు దామగుండం అడవి భూమిని స్వాధీనం చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వాన్ని కోరితే.. స్థానికుల వినతి మేరకు అనుమతులు ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడవక ముందే అనుమతులతో పాటు నేవీ అధికారులకు అవసరమైన పత్రాలను సైతం అందజేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాలు, శాస్త్రవేత్తలు రాడార్ కేంద్ర ఏర్పాటు వద్దంటూ నినాదిస్తున్నారు.
దామగుండం ఫారెస్ట్, రెవెన్యూ భూముల సరిహద్దులను శుక్రవారం సర్వే నిర్వహించారు. ప్రభుత్వం దామగుండం దేవాలయానికి చెందిన సుమారుగా 38 ఎకరాలకు పైగా భూమితో పాటు ఫారెస్ట్‌కు చెందిన 2,900 ఎకరాల భూమిని నేవీ శాఖకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో నేవీ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు కలిసి భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ సరిహద్దులతో పాటు దేవాలయ భూమి సరిహద్దులను సర్వే చేస్తున్నారు. గతంలో టేకులబీడుతండా ప్రాంతం భూమిలోని మట్టి నమూనా సేకరించారు. నేవీ అధికారులు ఈ భూమి ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న సరిహద్దులు చూసుకుంటున్నారు.