ఇబ్రహీంపట్నం ఆగస్టు 10 : శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసులకు సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పరిసరాలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. నేరాల అదుపునకు మరిన్ని సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న సీసీ టీవీ ఫుటేజీల నిర్వహణలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి చోరీలను నియంత్రించాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయడంతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికి మనోధైర్యాన్ని కల్పించాలని, పోలీసులంటే భయం వద్దని స్నేహభావాన్ని పెంపొందించాలన్నారు.
మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని, వారు పోలీస్ స్టేషన్కు వస్తే మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీపీ వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు సీఐ శ్రీ ఆంజనేయులు తదితరులు ఉన్నారు