ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులు ఉదయం నుంచే పంపిణీ కేంద్రాల ఎదుట పడిగాపులు కాస్తున్నా సరిపడా అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంతోపాటు యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యూరియాకోసం రైతులు తెల్లవారు జామునుంచి క్యూలో ఉన్నారు. అందరికీ ఎరువు దొరకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
నందిగామ : మండలంలోని చేగూరు సొసైటీకి మంగళవారం యూరియా వస్తుందన్న సమాచారంతో రైతులు తెల్లవారుజాము నుంచే అక్కడ వందల సంఖ్యలో రైతులు క్యూలో నిరీక్షించారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలే పంపిణీ చేయడంతో.. చాలా మందికి యూరియా లభించకపోవడంతో తీవ్ర నిరాశతో వెళ్లిపో యారు. 15 రోజులుగా యూరీయా కోసం తిరుగుతున్నా దొరకడంలేదని, ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం తోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఎరువు సరిపడా లభించిందని గుర్తు చేసుకున్నారు.
కడ్తాల్, సెప్టెంబర్ 9 : మండలానికి యూరియా వస్తుందనే సమాచారం తెలుసుకున్న రైతు లు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. కడ్తాల్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 225, రావిచేడ్ గ్రామంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 225 యూరియా బస్తాలొచ్చాయి. ఆయా కేంద్రాల వద్ద రైతులకు టోకెన్లు అందజేసి, పోలీసుల పహారాలో ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున పంపణీ చేశారు. వ్యవసాయ పనులను వదులుకుని వస్తే ఒక్క బస్తా కూడా లభించలేదని రైతులు వాపోయారు. సరిపడా అందించాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో యూరియాకోసం రైతులు బారులు తీరుతూ అవస్థలు పడుతున్నారు. మంగళవారం తాండూరు పట్టణంతోపాటు యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యూరియాకోసం రైతులు తెల్లవారు జామునుంచి క్యూలో ఉన్నారు. అందరికీ ఎరువు దొర కపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. రైతులకు సరిపడా అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్, రవీందర్‌రెడ్డి, సలీం మాట్లాడుతూ .. రైతులు రోడ్లపై బారులు తీరినా ప్రభుత్వానికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. రేవంత్ పాలలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు.
దోమ : మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందన్న విష యం తెలుసుకున్న రైతులు ఉద యాన్నే ఆధార్ కార్డులతో అక్కడ భారీగా బారులుదీరారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పునే ఇవ్వడంతో మిగిలిన క్యూలో ఉన్న రైతులకు యూరియా అందకపోవడం తో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర నిరాశతో ఇండ్లకెళ్లారు.
ఆమనగల్లు /చేవెళ్లటౌన్/కులకచర్ల : ఆమనగల్లు పట్టణంలోని ఆగ్రోరైతు సేవా కేంద్రం వద్ద రైతులు ఉదయం నుంచే పాస్‌బుక్, ఆధార్‌కార్డు, జిరాక్స్పత్రాలతో క్యూలో నిలబడ్డా రు. చివరికి కొంతమందికే యూరియా అందగ.. మిగిలిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలోని మన గ్రోమోర్ వద్ద కూడా రైతులు బారులు తీరారు. చౌడాపూర్ మండల కేంద్రంలోని డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రంలో రైతులు యూరియా కోసం పాసుపుస్తకాల జిరాక్స్ కాపీలు క్యూలో పెట్టారు.