షాద్‌నగర్‌రూరల్,జూన్12: విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక విద్యార్థులకు సూచించారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో బుధవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సర్కార్ బడుల్లోనే క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు సమకూర్చనున్నట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తుందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తరగతిగదుల్లోనే నిర్మాణమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగాలన్నారు. ప్రతి మూడో శనివారం పాఠశాలలో నిర్వహించే సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొనాలన్నారు. సర్కార్ బడుల్లో ఉన్న విద్యాప్రమాణాలు ప్రైవేటు పాఠశాలల్లో ఉండవని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. పది ఫలితాల్లో 25 ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత రావడంతోపాటు 50 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్, గవర్నర్ సత్యనారాయణతో పాటు ఎంతో మంది మేధావులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు శ్రద్ధ్దగా చదువుకోవాలన్నారు. ఎంతో గొప్ప చరిత్ర గల మొగిలిగిద్ద పాఠశాలకు విద్యార్థులు మరింత వన్నె తీసుకొచ్చెవిధంగా ఉన్నత స్థాయికి ఎదుగాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు సమకూర్చనున్నట్లు తెలిపారు. తాము సర్కార్ బడుల్లోనే విద్యను అభ్యసించినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. ఆడపిల్లల చదువులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఉన్నత చదువులతోనే బంగారు భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, డీఅర్డీవో శ్రీలత, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, ఐసీడీఎస్ అధికారిణి నాగలక్ష్మి, ఎంఈవో శంకర్‌రాథోడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్‌గౌడ్, మండలపార్టీ అద్యక్షడు శ్రీకాంత్‌రెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, అశోక్, గ్రామస్తులు శ్యాంసుందర్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.