యాసంగి వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను షురూ చేయకపో వడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సరిపడా కల్లాలు లేక వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయలో తెలియక.. అకాల వర్షాల భయంతో దళారులకు తక్కువ ధరకు అమ్ముతూ నష్టాల పాలు అవుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పంటల కోతల సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోగా.. ప్రస్తుత సర్కార్ రైతులను పట్టించుకోకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ
షాబాద్, మే 2 : షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్, శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. కోతలు మొదలుపెట్టి 15 రోజులు దాటుతున్నా కేంద్రాలు లేకపోవడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో అన్నదాతలున్నారు. మోకిలలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని బ్యానర్ ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పటివరకూ ఒక్క గింజనూ కొనలేదు. ప్రస్తుతం అక్కడ ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. సర్దార్‌నగర్‌లో కేంద్రం ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత లేదని, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేవని అధికారులు సెలవిస్తున్నారు.
ఆమనగల్లు : ధాన్యాన్ని విక్రయించేందుకు కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో రేవంత్ సర్కార్ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించలేదు. ఆమనగల్లు, మాడ్గుల మం డలాల్లో మాత్రం ఒక్కో కేంద్రాన్ని చొప్పున ప్రారంభించింది. ఆమనగల్లు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తలకొండపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న కొనుగోలు కేంద్రాన్ని షురూ చేసినా ధాన్యం సేకరణ మాత్రం గత నెల 24 నుంచి ప్రారంభం కాగా ఇప్పటివరకు 1190( 2,975 సంచులు)(1 సంచి 40 కిలోలు) క్వింటాళ్ల సన్న రకం, దొడ్డురకం 1510 క్వింటాళ్లు (3777 సంచులు) కొన్నట్లు సిబ్బంది తెలిపారు. తరుగు పేరిట క్వింటాల్‌కు 4 కిలోలు కట్ చేస్తున్నట్లు రైతులు వాపో తున్నారు. దాంతోపాటు క్వింటాల్‌కు రూ.50 హమాలీ చార్జి తీసుకుంటూ అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే క్వింటాల్‌కు 4 కిలోల చొప్పున తరుగు తీయడం తగదు. ఈ విధంగా అన్నదాతను నిలువు దోపిడీ చేయొద్దు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
-కేతావత్ డాక్యా (వాసుదేవ్పూర్)
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వరి కోతలు ప్రారంభమై దాదాపు నెల రోజులవుతున్నది. పది రోజుల కిందట డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, దండుమైలారం, మంచాల, బోడకొండ, యాచారం, మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, చింతపట్ల, తొర్రూరు, గౌరెల్లి గ్రామాల్లో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా..కేవలం దండుమైలారం, తొర్రూరు కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభమ య్యాయి. మిగిలిన ఎనిమిది కొనుగోలు కేంద్రాల్లో నేటికీ గింజ ధాన్యాన్ని కూడా కొనకపోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నదాతలు మండిపడుతున్నారు. సరిపడా కల్లాల్లేక.. రోడ్లపై ఆరబోసిన ధాన్యం సాయంత్రం సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో తడిసి పోతున్నదని.. అందుకే తక్కువ ధరకే దళారులకు పంటను విక్రయిస్తూ నష్టపోతున్నట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండుమైలారం, తొర్రూరు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల సమస్య రైతులను వేధిస్తున్నదని.. అధికారులు స్పందించి సంచులను అందుబాటులో ఉంచి త్వరగా ధాన్యాన్ని సేకరించాలని కోరుతున్నారు.
పంట కోసి నెల రోజులు దాటుతున్నది. బోడకొండ వద్ద పది రోజు ల కిందట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటివరకు గింజా ధాన్యాన్ని కూడా కొనలేదు. త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను అడిగితే లేబర్ కొరత కారణంగా కొనడంలేదని చెబుతున్నారు. ప్రతిరో జూ ధాన్యా న్ని ఆరబోస్తున్నాం. సాయంత్రం కాగానే అకాల వర్షం కురిసి ధాన్యం తడిసిపోతుంది. మా బాధ ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావడంలేదు. అధికారులు స్పందించి వెంటనే కొనాలి.
-రమావత్ నడ్జా, కొర్రవానితండా
పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే తరుగు పేరి ట క్వింటాల్‌కు 4 కిలోల చొప్పున కట్ చేయడంతోపాటు హమాలీలు 1 క్వింటాల్‌కు రూ.50 వసూలు చేస్తూ మరల ముట్టి పేరిట హమాలీలు, పని చేస్తున్న మహిళలు రైతుల దగ్గర ధాన్యం తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు . రైతులను ఇలా నట్టేట ముంచడం తగదు.
-ఉప్పుల యాదయ్య (జంగారెడ్డిపల్లి )
ధాన్యాన్ని విక్రయించేందుకు ఆదివారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. తేమ పేరుతో ఐదు రోజులుగా తూకం వేయడం లేదు. 1 క్వింటాల్‌కు 4 కిలోల చొప్పున తరుగు తీస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఇలా తరుగు తీయడం రైతులకు మోసం చేయడమే.
-తాళ్ల యాదమ్మ (సంకటోనిపల్లి )
మండలంలో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడంతోనే పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించ లేదు. డిమాండ్‌కు తగ్గట్టు గన్నీ బ్యాగులను పంపాలని ఉన్నతాధికారులకు సమాచారమందించాం. రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-గంప వెంకటేశ్‌గుప్తా, పీఏసీఎస్ చైర్మన్, కడ్తాల్ మండలం
ఉదయమే కల్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని ఆరబెడుతున్నాం. ఎండలో ఉండడంతో జ్వరాలు వస్తున్నాయి. రాత్రి దవాఖానకెళ్తే వందల రూపాయలు ఖర్చు అవుతున్నది. ఇంకా ఎన్ని రోజులు ధాన్యాన్ని ఆరబెడుతూ ఉండాలి. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలి. కేసీఆర్ సారు ఉండగా ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు పంటవస్తే అప్పుడు ధాన్యం కొని, వెంటనే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. ఈ కాంగ్రెస్ వచ్చాక మాకు అన్నీ కష్టాలే
-జాటోతు నాను, బోడకొండ
గన్నీ బ్యాగుల కొరతతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ నిలిచిపోయింది. మూడు రోజుల నుంచి గన్నీ బ్యాగులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ, అవి రావడంలేదు. దీంతో అక్కడ ధాన్యం రాశులు నిండిపోతున్నారు. అధికారులు స్పందించి త్వరగా కొనుగోలు జరిగేలా చూడాలి.
-లింగం, దండుమైలారం
కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ధాన్యం కొసే సమయానికంటే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఈ రేవంత్ సర్కారు వచ్చినంక అన్నదాతలకు అన్నీ కష్టాలే. నెలరోజులుగా ధాన్యం కల్లంలోనే ఉంటున్నది. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి.
-రమావత్ కోక్యానాయక్, కొర్రవానితండా
తేమను చెక్ చేసేందుకు కొన్ని వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా.. వాటిని అక్కడి సిబ్బంది చూడనేలేదు. మిషన్ లేదని చెబుతున్నారు. ఆ యంత్రం ఎప్పుడు వస్తుందని అడిగితే తమకు తెలియదంటున్నారు. ఎవరినీ అడగాలో తెలియడం లేదు. ఇలాంటి సమస్యలు ఉంటాయనే చాలామంది రైతులు మధ్యదళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టాల పాలు అవుతున్నారు.
– జగన్, రైతు, గంట్లవెల్లి, ఫరూఖ్‌నగర్ మండలం
ఇక్కడ కొనుగోలు కేంద్రం ఉన్నట్లు తెలియదు. అయినా ఆ కేంద్రంలో ధాన్యాన్ని విక్రయిస్తే సమయానికి డబ్బులు రావు. ఆ డబ్బులు వచ్చే వరకు కూలీలు, ట్రాక్టర్, అప్పిచ్చిన వారు ఆగరుకాదా.. వానకాలంలో అమ్మిన రైతులకే ఇప్పటికీ బోనస్ పైసలు రాలేదని అం టుండ్రు. ఇవన్నీ తిప్పలు ఎందుకని మార్కెట్లో వ్యాపారికి విక్రయిస్తున్నా. అక్కడ క్వింటాకు రూ. 1900 నుం చి రూ. 2000 ధర వస్తుంది. దీంతో అక్కడే చాలామంది విక్రయిస్తున్నారు.
– తౌర్యా, రైతు, హేమాజీపూర్
షాద్‌నగర్, మే 2 : షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడ మండలాలకు కలిపి షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని గత నెల 29న ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటైన విషయం సమీప గ్రా మాల రైతులకు తెలియదు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్లు అధికారులు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమ య్యారు. అంతేకాకుండా ఈ కేంద్రం ఉదయం 11 గంటల దాటినా తెరుచుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. తేమ ను పరీక్షించే మిషన్, తూకం పరి కరాలు, నాణ్యతాప్రమాణాలపై అవగాహన కల్పించే సిబ్బంది లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 1500 బస్తాలు, సుమారు 600 క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్ర మే సేకరించినట్లు సమాచారం.